వజ్రాల కోసం మట్టిన తవ్విస్తోంది ఓ మైనింగ్ సంస్థ. ఆ మట్టిని గాలించి, ప్రతి రాయిని పరిశీలించి.. ఏదైనా దొరికితే తీసుకుంటోంది. తర్వాత ఆ మట్టిని, రాళ్లను తీసుకెళ్లి దూరంగా పారబోస్తోంది. ఓ ఇంటి వెనుక పెరట్లో కాస్త గుంతలా ఉండటంతో మట్టికావాలని దాని యజమాని అడిగాడు. దీనితో మట్టి తరలించే కాంట్రాక్టర్.. వజ్రాల గనిలో తవ్వి, పరిశీలించిన మట్టి, రాళ్ల కుప్పను తీసుకువచ్చి ఆ ఇంటి వెనుక పెరట్లో పారబోశాడు. తర్వాత ఆ ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారికి.. ఆ మట్టి, రాళ్ల కుప్పలో మెరుస్తున్న ఓ రాయి దొరికింది. అదే ప్రపంచంలో అత్యంత స్వచ్ఛమైన, పెద్ద పసుపు రంగు వజ్రం ‘గోల్డెన్ కనరీ’కి ముడి రూపం. త్వరలోనే ఈ వజ్రాన్ని వేలం వేయనున్నారు.
1980లో కాంగో దేశంలోని ఎంఐబీఏ అనే వజ్రాల మైనింగ్ సంస్థ తవ్విన గనికి సంబంధించిన మట్టిలో ఈ గోల్డెన్ కనరీ వజ్రం దొరికింది. ఆ చిన్నారి ఈ రాయిని తీసుకెళ్లి ఇంటి యజమానికి ఇచ్చింది. అది వజ్రమని గుర్తించిన ఆయన.. స్థానిక వజ్రాల వ్యాపారికి అమ్మి డబ్బులు తీసుకున్నాడు. ఆ సమయంలో దాని బరువు ఏకంగా 890 క్యారెట్లు కావడం గమనార్హం. అంటే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వజ్రం అన్నమాట.ఆ వజ్రం చేతులు మారుతూ, సానపెట్టే క్రమంలో ముక్కలు అవుతూ వచ్చింది. వాటిలో ప్రస్తుతమున్న పెద్ద ముక్కను ‘గోల్డెన్ కనరీ’ వజ్రంగా పిలుస్తున్నారు. దీని బరువు 303.1 క్యారెట్లు. ప్రస్తుతం దీనిని దుబాయ్ లోని సోత్ బీ వేలం శాలలో ప్రదర్శనకు ఉంచారు. ఈ ఏడాది డిసెంబర్ ఏడో తేదీన న్యూయార్క్ లోని సోత్ బీ వేలం శాలలో ఈ వజ్రాన్ని వేలం వేయనున్నారు. దీనికి కనీసం రూ.124 కోట్లకుపైగా ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు.