Tuesday, November 26, 2024

Water Projects | జులైలో ఏదుల రిజర్వాయర్‌ ట్రయిల్‌ రన్‌.. పంపు హౌస్‌ పనులు పూర్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకంగా భావిస్తున్న వీరాంజనేయ జలాశయం(ఏదుల) పంపు హౌసు సిద్ధమైంది. గుట్టలను కలుపుతూ కట్టలను నిర్మించి జలాశయాలను ఏర్పర్చిన కాకతీయులను ఆదర్శంగా తీసుకుని కొండలను కలుపుతూ నిర్మిస్తున్న ఈ జలాశయం పనులు పూర్తి కావచ్చాయి. భూత్పూర్‌ మండలం కరివెన దగ్గర నిర్మాణం ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఐదు జలాశయాలను అనుసంధానం చేస్తూ లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాదిగ్రామాలకు తాగునీరు అందించేందుకు నిర్మాణం వేగంగా జరుగుతుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలమేరకు రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, సీఎం కేసీఆర్‌ కార్యదర్శి స్మితాసబర్వాల్‌ ఏదుల ప్రాజెక్టు పనులను పరిశీలించి ఇంజనీర్లను అభినందించారు. దాదాపుగా పూర్తి అయిన ఏదుల పంపుహౌస్‌ జూలై ఆఖరినాటికి నీరు అందించేందుకుసిద్ధం చేయాలని ఈసందర్భంగా ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం ఏదుల పంపింగ్‌ స్టేషన్‌ దగ్గర నిర్మించిన 400 కేవి. సబ్‌ స్టేషన్‌ నుంచి పంపింగ్‌ వరకు నిర్మించిన 60 కిలోమీటర్ల ట్రాన్స్‌ మిషన్‌ పనులను ప్రశంసించారు. ఈ నేపథ్యంలో త్వరలో ఏదుల పంపుహౌసు ట్రయిల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ప్రకటించారు.

గడువులోగా ఏదుల రిజర్వాయర్‌ నీటిని పారించేందుకు అన్నిపనులు దాదాపుగా పూర్తి అయినట్లు చెప్పారు. సముద్రమట్టానికి 269.735 మీటర్ల ఎత్తులో 6.55 టీఎంసీల సామర్ధ్యంతో కొండలను కలుపుతూ 7.716 కిలోమీటర్ల ఏదుల రిజర్వాయర్‌ కట్టలు పూర్తి కావడంతో పాటుగా పంపు హౌసు పనులు పూర్తి కావడంతో ట్రయిల్‌ నిర్వహించి తొలుత తాగునీరు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement