సొంతపార్టీ నేతలనే కాదు ఆ పార్టీ సీఎం జగన్ ని కూడా పదునైన మాటలు, పలు ఆరోపణలు చేస్తుంటారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు ఈ రెబల్ ఎంపీ. మరి ఇప్పుడాయన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. నరసాపురం పార్లమెంట్ సభ్యత్వానికి రఘురామకృష్ణంరాజు రాజీనామా చేయనున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. రీసెంట్ గా తిరుపతిలో పర్యటించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఈ మేరకు ఇతర పార్టీల్లోని గట్ట నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని పిలుపునిచ్చారు. ఇతర పార్టీల్లోని నేతలను బీజేపీలో చేర్చుకోవాలని చెప్పిన సందర్భంలో రఘురాజు పేరును అమిత్ షా ప్రస్తావించారనే టాక్ వినిపించింది. దాంతో వైసీపీకి తిరుగుబాటు ఎంపీ గుడ్ బై చెప్పేసి బీజేపీలోకి చేరటం ఖాయమనే వార్తలు ఊపందుకున్నాయి.
కాగా ఈ మేరకు రఘురామకృష్ణంరాజు ఈనెల 17 కానీ , 25వ తేదీన కానీ రాజీనామా చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. న్యాయస్ధానం టు దేవస్ధానం పేరుతో అమరావతి జేఏసీ చేస్తున్న పాదయాత్ర ముగింపు సభ ఈనెల 17వ తేదీన తిరుపతిలో భారీఎత్తున చేయాలని ప్లాన్ జరుగుతున్న సంగతి విదితమే. అదే సమయంలో ఎంపీ తన రాజీనామా నిర్ణయాన్ని బహిరంగసభలో ప్రకటిస్తారంటున్నారు. ఒకవేళ ఆరోజు కాకపోతే ఇదే నెల 25వ తేదీన మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయ్ జయంతి సందర్భంగా ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
ఏదేమైనా రఘురాజు ఎంపీ పదవికి రాజీనామా చేయటం వల్ల జరిగే ఉపఎన్నిక మాత్రం చాలా రసవత్తరంగా ఉంటుంది. ఇప్పటికే రఘురాజు వ్యవహారశైలిపై జగన్మోహన్ రెడ్డి అండ్ కో బాగా మంటమీదుంది. రాజీనామా చేసిన తర్వాత రఘురామ ఉపఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తారనటంలో సందేహమే లేదు. ఎంపీ రాజీనామా చేస్తే ఉపఎన్నికలు వస్తే జగన్ సత్తానా .. లేకపోతే ప్రతిపక్షాల సత్తానా అనేది తేలుతుంది. మరి ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రఘురామ స్వయంగా ప్రకటిస్తే ఈ విషయంపై ఓ క్లారిటీ వస్తుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..