Sunday, November 17, 2024

టీడీపీకి విజయసాయిరెడ్డి హెచ్చరిక.. జూలై 23న శుక్రవారం ఏమవుతుంది?

ఏపీలో రాజకీయం ఇటీవల శుక్రవారం చుట్టూ తిరుగుతోంది. ప్రతి శుక్రవారం ప్రభుత్వం తమ పార్టీకి చెందిన నేతలను అరెస్టులు చేస్తూ వస్తోందని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపిస్తోంది. అటు ప్రతి శుక్రవారం సీఎం జగన్ ఆస్తుల కేసు విచారణ ఉండనే ఉంది. మరోవైపు తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జూలై 23.. శుక్రవారం టీడీపీకి కాలరాత్రి అంటూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

‘23వ తేదీ టీడీపీకి కాళ‌రాత్రి. రాష్ట్రానికి పట్టిన శని వదిలిన రోజు. రెండేళ్ల క్రితం గురువారం, మే 23కే టీడీపీ అంతలా వణికింది. గోడదెబ్బ – చెంపదెబ్బ అన్నట్లుగా ఈ ఏడాది జూలై 23 శుక్రవారం వస్తోంది. ఆ రోజు పచ్చ పార్టీ పటాపంచలేనా? దేవుడు ఏం రాసిపెట్టాడో?’ అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. దీంతో ఆరోజు ఏం చేయ‌బోతున్నారు.. ఎవ‌రిని టార్గెట్ చేయ‌బోతున్నారు అన్న దానిపై బిగ్ డిబేట్ న‌డుస్తోంది.

ఇప్పటి వరకు చూస్తే పలువురు టీడీపీ నేతలను వైసీపీ ప్రభుత్వం శుక్రవారం అరెస్ట్ చేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి. ఈఎస్ఐ స్కాంలో అచ్చెనాయుడును గ‌తేడాది జూన్ 12, శుక్ర‌వారం అరెస్ట్ చేయ‌గా.. ఆ త‌ర్వాత హ‌త్య కేసులో కొల్లు ర‌వీంద్రను జులై 3, శుక్ర‌వారం రోజే అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ధూళిపాళ్ల న‌రేంద్ర‌ను కూడా ఏప్రిల్ 23, శుక్ర‌వారం రోజునే అరెస్ట్ చేశారు. అంతే కాదు.. ఆ మ‌ధ్య చంద్రబాబుకు నోటిసులు ఇస్తూ.. 23వ తేదీనే విచారణకు రావాల‌ని ఏపీ సీఐడీ కోరింది. దీంతో 23 లేదా శుక్ర‌వారం పేరు వింటేనే టీడీపీ నేత‌లు ఆందోళ‌న‌ప‌డే ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌రి జూలై 23 శుక్రవారం ఏదో జ‌ర‌గ‌బోతోంద‌ని స్వ‌యంగా విజ‌య‌సాయిరెడ్డినే ట్వీట్ చేయ‌డంతో.. ఇప్పుడు అంద‌రి దృష్టి ఆ తేదీపైనే ప‌డింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement