ప్రజలు తమ పరిపాలన గురించి ఏమనుకుంటున్నారో అని అప్పట్లో రాజులు, మంత్రులు మారు వేషాల్లో వెళ్లేవారట. అయితే అచ్చు ఇప్పుడదే పనిని చేశారు ఓ ఎమ్మెల్యే. ఆయనే వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు. ఏకంగా సన్యాసి అవతారం ఎత్తారు. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలపై ఆరా తీశారు. ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా తీరుతెన్నూ మార్చేసి… మారువేషం వేసి మరీ గ్రామాల్లో పర్యటిం చారు కన్నాబాబు. ఈ సందర్భంగా ఆయన పలువురు స్థానికులతో మాట కలిపారు. బిక్షాం దేహీ అంటూ.. మహిళలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు పలు సమస్యలు వివరించారు. నిత్యావసర ధరలు ,విద్యుత్తు ఛార్జీలు అధికంగా ఉన్నాయని చెప్పారు. రోడ్లు బాగోలేవని ప్రస్తావించారు. ప్రభుత్వం 50 శాతం పథకాలు అందిస్తే, ధరలు పెరుగుదలతో ఖర్చులు మరింత పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు తెలిపిన సమస్యలను శ్రద్ధగా విన్న తర్వాత నేరుగా తహసీల్దార్ రాంబాయి, ఎంపీడీఓ కృష్ణల వద్దకు ఇదేవేషంలో వెళ్లిన కన్నబాబు ప్రజలు లేవనెత్తిన సమస్యలపై మాట్లాడారు. అయితే.. ఎమ్మెల్యే సన్యాసి వేషంలో రావడంతో తొలుత అధికారులు పట్టించుకోలేదు. అంతేకాదు. ఇన్ని విషయాలు అడుగుతున్నారు… మీరెవరంటూ తహసీల్దార్ రాంబాయి నిలదీశాడు. మీకు ఎందుకు.. వెళ్లి.. ప్రవచనాలు చెప్పుకోవచ్చు కదా.. అనేశారు. దీంతో కన్నబాబు.. తన వేషం తొలగించి ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రభుత్వ పథకాలపై 100 శాతం ప్రజలు ఆనందంగా ఉన్నారని ఆయన తెలిపారు.అయితే.. సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అయితే.. రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే ఇలా మారు వేషంలో ప్రజలను కలవడం.. వారి సమస్యలు తెలుసుకోవడం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది. మరి ఇదిజగన్ సూచనల మేరకు చేశారో.. లేదా.. తనే ఇలా వేషం కట్టారా అనేది చూడాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..