ఏపీ అప్పులపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మొత్తం అప్పు రూ. 7 లక్షల కోట్లకు చేరుతోందని అన్నారు. 2020-21 జీఎస్డీపి మైనస్ 2.58 శాతం మేర తిరోగమనంలో ఉందన్నారు. పేదలు, సామాన్యుల బతుకు దుర్భరంగా మారిందని చెప్పారు. ఏపీలో ఆర్ధిక అసమానతలు 38 శాతం నుంచి 43 శాతానికి పెరిగాయని తెలిపారు. రెండున్నరేళ్ల జగన్ పాలనలో ఏపీ ఆర్థిక స్థితి అధఃపాతాళానికి చేరిందన్నారు. ఆర్థిక క్రమశిక్షణ గాలికొదిలేసి అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని దిగజార్చారని మండిపడ్డారు. మూలధన వ్యయం అంతకంతకూ అడుగంటుతోందని పేర్కొన్నారు. రెవెన్యూ రాబడులు గణనీయంగా తగ్గాయన్న యనమల.. గ్యారంటీలు 90% నుంచి 180 శాతానికి పెరిగిపోయాయన్నారు.
వైసీపీ ప్రభుత్వ విధానాలపై గ్రీన్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ధిక అస్థిరత నుంచి బయటపడి, రెండంకెల వృద్ధి సాధించేందుకు.. జగన్ ప్రభుత్వ కార్యాచరణను గ్రీన్ పేపర్ ద్వారా బయటపెట్టాలని యనమల తెలిపారు. ద్రవ్యలోటును రెవిన్యూ లోటు అధిగమించడం ఎక్కడా చూడలేదన్నారు. మార్కెట్ రుణాలను, ఆఫ్ బడ్జెట్ అప్పులు మించిపోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఓటిఎస్ పేరుతో హౌసింగులో బలవంతపు వసూళ్లకు తెగబడ్డారని ఆరోపించారు. పన్నుల వాతలు, అడ్మినిస్ట్రేషన్ ఛార్జీల మోతతో ప్రజలు అల్లాడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను బంగాళాఖాతంలో కలిపేశారని యనమల విమర్శించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..