Saturday, November 23, 2024

నేడే యాదాద్రి ఆలయ ఉద్ఘాటన.. తొలిపూజ చేయనున్న సీఎం కెసిఆర్

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో స్వయంభువుల నిజదర్శనాలకు శుభతరుణం ఆసన్నమైంది. సుమారు ఆరేళ్ల అనంతరం మూలవరుల దర్శనాలు పునఃప్రారంభం అవుతున్నాయి. సోమవారం ఉదయం జరిగే ఆలయ ఉద్ఘాటన మహాక్రతువుకు రంగం సిద్ధమైంది. మహాకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొననున్నారు.

వారం రోజులుగా బాలాలయంలో కొనసాగుతున్న పంచకుండాత్మక మహాయాగంలో మహాపూర్ణాహుతి నిర్వహించిన అనంతరం ప్రతిష్ఠామూర్తులతో ఉదయం 9.30 గంటలకు చేపట్టే శోభాయాత్రతో ఉద్ఘాటన క్రతువు మొదలవుతుంది. తొలుత శోభాయాత్ర ప్రధానాలయ రెండో మాడవీధిలో ప్రదక్షిణ అనంతరం తొలి మాడవీధిలోకి ప్రవేశించగానే మహాకుంభ సంప్రోక్షణ చేపడతారు. విమాన గోపురంపై శ్రీ సుదర్శనాళ్వారులకు జరిపే సంప్రోక్షణతో ఆరు రాజగోపురాలపై స్వర్ణ కలశాలకు సంప్రోక్షణ నిర్వహిస్తారు. మిథునలగ్నంలో ఏకాదశి నాడు ఉదయం 11.55 గంటలకు ఈ మహోత్సవం ఆవిష్కృతం కానుంది. అనంతరం 12.10 గంటలకు ప్రధానాలయ ప్రవేశంతో పాటు గర్భాలయంలోని స్వర్ణ ధ్వజస్తంభ సందర్శన ఉంటుంది. సరిగ్గా 12.20 గంటలకు గర్భాలయంలోని మూలవరుల దర్శనం మొదలుకానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకొని ప్రథమ పూజలు చేయనున్నారు. దర్శనాలు, పూజల అనంతరం క్షేత్రాభివృద్ధికి కృషిచేసిన వారందరినీ ఆలయ మాడవీధిలో సీఎం కేసీఆర్ సన్మానిస్తారు.

ఆలయ ఉద్ఘాటన మహాక్రతువుకు ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నందున దాదాపు 2,000 మంది పోలీసులతో భద్రతను నిర్వహిస్తున్నారు.

దేశంలోనే తొలిసారిగా పూర్తిగా కృష్ణ శిలలతో నిర్మితమైన దివ్యధామం యాదాద్రి క్షేత్రం. రెండున్నర లక్షల టన్నుల కృష్ణశిలలతో.. ఇద్దరు స్థపతులు, 12 మంది ఉపస్థపతులు, 800 మంది శిల్పులు.. 1500 మంది కార్మికులు.. 66 నెలల పాటు శ్రమించి రూపుదిద్దిన మహాక్షేత్రమిది.

Advertisement

తాజా వార్తలు

Advertisement