Saturday, November 23, 2024

28న యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ.. హాజరు కానున్న సీఎం కేసీఆర్‌

యాదాద్రి/హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధమైంది. ఈనెల 28 నుంచి మూలవిరాట్‌ దర్శనానికి అనుమతిస్తామని యాదాద్రి ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) గీతారెడ్డి తెలిపారు. ఈనెల 28న నిర్వహించే పూర్ణాహుతి తర్వాత మహాకుంభ సంప్రోక్షణ చేపడతామని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు. హహాకుంభ సంప్రోక్షణ అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పూజల సమయంలో దర్శనానికి భక్తులను అనుమతించమన్నారు. సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. ఈనెల 21వ తేదీ నుంచి యాదాద్రి ఆలయ ప్రాంగణంలో శ్రీ సుదర్శన నారసింహ యాగం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆమె చెప్పారు. ఉదయం 9 గంటలకు అంకురార్పణతో యాగం ప్రారంభమవుతుందని, ఆ రోజు నిత్యం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు యాగాలు జరుగుతాయని చెప్పారు. యాగశాలల నిర్మాణం శనివారం పూర్తవుతుందని అన్నారు.

వేద పండితులు, రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు చెందిన అర్చకులను సంప్రోక్షణ, ఇతర కార్యక్రమాలకు రప్పిస్తున్నామని వారంతా శనివారానికి చేరుకుంటారని పేర్కొన్నారు. వీరిని యాదాద్రికి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. జపాలు, పారాయణాలను నిర్వహించేందుకు ప్రధాన అర్చకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని ఆమె వెల్లడించారు. నారసింహ స్వామివారికి కైంకర్యాలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అర్చకులు సూచించిన విధంగా అన్ని పూజా సామాన్లను కొనుగోలు చేశామని, పారాయణదారులను, వేద పారాయణదారులను, ఇతర ఆలయాల్లో పని చేస్తున్న అర్చక సిబ్బందిని డెప్యూటేషన్‌పై రప్పిస్తున్నామని ఈ మేరకు దేవాదాయ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారని ఈవో చెప్పారు. వీరికి వసతి, ఇతర సౌకర్యాలను తమ ఆలయం కల్పిస్తోందని దర్శనానికి వచ్చే భక్తులంతా మూలమంత్ర జపాలు, పారాయణం తదితర కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రధాన అర్చకులు ప్రణాళికలు సిద్ధం చేశారని చెప్పారు. మతపరమైన ఇబ్బందులు ఏవీ తలెత్తకుండా నారసింహుడికి అవసరమైన కైంకర్యాలన్నీ చేపడతారని చెప్పారు. బాలాలయంలో సుదర్శన హోమం, కళ్యాణం, ఆర్జిత సేవలు నిర్వహిస్తున్నందున స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు పాతగుట్ట స్వయంభు ఆలయంలో చేసుకోవడానికి అనుమతిస్తామని చెప్పారు. ఈనెల 21వ తేదీనుంచి వచ్చే భక్తులు స్వామి వారిని, యాగాన్ని దర్శించుకునేందుకు వీలు కల్పిస్తామని చెప్పారు.


యాగ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎవరిని ఆహ్వానించడం లేదని, ఇది భగవంతుడికి చేస్తున్న కార్యక్రమమైనందున ప్రత్యేక ఆహ్వానితులు ఎవరూ ఉండరని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 28న జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎంత మంది భక్తులు వచ్చినా అన్నప్రసాదం అందించేందుకు దేవస్థానం సిద్ధంగా ఉందని చెప్పారు. ఆన్‌లైన్‌ ద్వారా భక్తులు టికెట్లు కొనుగోలు చేసి స్వామివారిని దర్శించుకోవచ్చని యాదాద్రి గుట్టపైన దర్శన టికెట్లు విక్రయించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు.

టికెట్ల కొనుగోలు జీయో ట్యాగింగ్‌ చేస్తున్నామని దీనివల్ల ఎంత మంది భక్తులు దేవుడిని దర్శించుకున్నది, వారి వివరాలు, చిరునామా వంటివి సునాయాసంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. భక్తుల రాకపోకల కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 75 బస్సులను నడిపేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని చెప్పారు. యాదాద్రి ఆలయ నిర్మాణంలో భూములు, స్థలాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా ప్రయోజనం కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారని ఈ కమిటీ ఇప్పటికే ఒక దఫా సమావేశమై చర్చించిందని త్వరలోనే విధి విధానాలు ఖరావుతాయని ఆమె చెప్పారు. స్థలాలు ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే అంశాన్ని ఖరారు చేసేందుకు త్వరలోనే ఈ కమిటీ మరోమారు సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఆర్జిత సేవలు రద్దు

సుదర్శన మహా యాగం సందర్భంగా బాలాలయంలో సుదర్శన హోమం, కల్యాణం, ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఈవో గీతారెడ్డి పేర్కొన్నారు. భక్తులు పాతగుట్ట ఆలయంలో ఆర్జిత సేవలు నిర్వహించుకోవాలని.. ఈనెల 21 నుంచి యాగశాలలో స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుందని చెప్పారు. బాలాలయంలో స్వామివారి దర్శనాలను ఆపడం లేదని ఈనెల 27 వరకు యధావిధిగా దర్శనాలు కొనసాగుతాయని ఆమె చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement