– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన షిర్డీ సాయిబాబా దేవాలయానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరుతోంది. కరోనా తర్వాత ఆంక్షలు సడలించడంతో సాయినాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ నవంబర్ దాకా బాబా సంస్థాన్‌కు రూ.398 కోట్ల మేర కానుకలు వచ్చినట్టు సంస్థాన్ సీఈవో భాగ్యశ్రీ భనాయత్ తెలిపారు. షిర్డీ సాయినాథుడికి వచ్చిన కానుకల్లో 27 కిలోల బంగారం, 3,056 కిలోల వెండితో పాటు డీడీలు, చెక్కులు, నగదు ఉన్నాయి.
ఇక.. విరాళాల రూపంలో రూ.77,89,04,984, హుండీలో కానుకల రూపంలో రూ.1,68,88,52,560, చెక్కులు, డీడీల రూపంలో రూ.19,68,41,408, డెబిట్, క్రెడిట్ కార్డు డొనేషన్ ద్వారా రూ.42,00,42,120, మనీ ఆర్డర్ల ద్వారా రూ.2,29,76,564 నగదు షిర్డీ సాయినాథుడికి చేరింది. దేశంలో తిరుపతి తర్వాత అత్యధిక మంది దర్శించుకునే దేవాలయం షిర్డీగా తెలుస్తోంది.
యాదాద్రి టెంపుల్‌కి భారీగా ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కళకళలాడుతోంది. తిరుమల తిరుపతికి దీటుగా ఇక్కడికి భక్తులు వస్తున్నారు. కార్తీకమాసంలో భక్తులు అధికసంఖ్యలో స్వామిని దర్శించుకుంటున్నారు. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తున్నారు. దీంతో స్వామివారికి రికార్డుస్థాయిలో నిత్యాదాయం సమకూరింది. ఆదాయం విషయంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయం రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తోంది.
ఆదివారం రెండో సారి అత్యథిక ఆదాయంతో రికార్డు సాధించింది. వివిధ పూజలతో స్వామి వారికి రూ.1,16,13,977 ఆదాయం వచ్చింది. స్వామి వారి నిత్య ఆదాయం గత ఆదివారం రూ.1.09 కోట్లు రాగా, ఈ ఆదివారం దానికి అదనంగా రూ. 6,31,531 ఆదాయం వచ్చినట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు.. ఇక తిరుమలకు దీటుగా 80వేల మంది భక్తులు యాదాద్రిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది.