పరీక్షలు అనగానే ఆందోళన మొదలవుతుంది.. కొందరు విద్యార్థులైతే భయంతో వణికిపోతుంటారు.. కొందరు మాత్రం ఎలాంటి భయం లేకుండా సిద్ధంగా ఉంటారు.. ఆందోళనతో పరీక్షా కేంద్రానికి వెళ్తే ఉన్నది కాస్త మరిచిపోయే ప్రమాదం ఉంటుంది. ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షా కేంద్రాలకు వెళ్లి భయం లేకుండా పరీక్ష రాయాల్సిన అవసరం ఉంది. ఇదే విషయమై ఇప్పటికే తల్లిదండ్రులతోపాటు లెక్చరర్లు కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. అయినా కొందరిలో ఆందోళన నెలకొంది. వీటన్నింటిని పక్కకు పెట్టి పరీక్షలకు సిద్ధం కావాలి. కరోనా నేపథ్యంలో రెండు సార్లు పరీక్షలు రాయకుండానే చాలామంది పాసయ్యారు.. ప్రస్తుతం కరోనా లేదు, దీంతో ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తోంది. ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని మంత్రి సబితారెడ్డి పిలుపునిచ్చారు. ఇంటర్ విద్యార్థులకు అందరికీ ఆల్‌ద బెస్ట్ చెప్పారు..
ఉమ్మడిరంగారెడ్డి, ప్రభన్యూస్‌బ్యూరో: శుక్రవారం నుండి ఇంటర్ ఫరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు వెళ్లి అడ్రస్ కూడా చూసుకున్నారు. దగ్గర్లో ఉండే విద్యార్థులకు సెంటర్లపై అవగాహన ఉన్నవాళ్లు మాత్రం ధీమాతో ఉన్నారు. ఈనెల 6వ తేదీనుండి 19వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలనుండి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష కొనసాగనుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 2.40లక్షల మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో బోయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువమంది ఉన్నారు. మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో 1.07లక్షల మంది విద్యార్థులు హాజరవుతుండగా వీరి కోసం ఏకంగా 730 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లాలో 17,565మంది విద్యార్థులు హాజరవుతుండగా 32 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో మొదటి సంవత్సరంలో 59,694మంది విద్యార్థులు హాజరుకానుండగా సెకండ్ ఇయర్‌లో మాత్రం 55,672మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. వీరి కోసం 156 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రం లోపలికి ఎలాంటి ఎలక్ట్రికల్ వస్తువులను తీసుకురావొద్దని అధికారులు సీరియస్‌గా వార్నింగ్ ఇస్తున్నారు.
నిమిషం ఆలస్యమైనా ఇంటికే..
విద్యార్థులు పరీక్షా కేంద్రానికి గంటముందే చేరుకోవల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది. పరీక్షా కేంద్రాల లోపలికి ఉదయం 8గంటలనుండే అనుమతిస్తారు. తొమ్మిది గంటలలోపు విద్యార్థులు పరీక్షా కేంద్రాల లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. నిముషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించరు. దీనిని దృష్టిలోపెట్టుకుని ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవల్సి ఉంటుంది. ఇంటినుండి ముందుగానే బయలుదేరాల్సి ఉంటుంది. చిన్నపాటి నిర్లక్ష్యం అయినా పెద్ద మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ తీసుకోవల్సి ఉంటుంది. సరైన సమయానికి పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దు.
మాస్కు తప్పనిసరి..
కరోనా వైరస్ ప్రభావం చాలావరకు తగ్గిపోయింది. అయినా ఇంటర్ విద్యార్థులు మాస్కు తప్పనిసరిగా పెట్టుకుని పరీక్షా కేంద్రాలకు హాజరుకావల్సి ఉంటుంది. ఫోర్త్ వేవ్ రాకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతోపాటు ఇన్విజిలేటర్లు కూడా మాస్కులు వేసుకోవల్సి ఉంటుంది. మాస్కులు వేసుకుంటే సేఫ్. అందుకే పరీక్షకు హాజరయ్యే వారందరూ మాస్కులు వేసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్లు వేసుకున్నామన్న భరోసాతో చాలారోజులనుండి జనాలు మాస్కులు పెట్టుకోవడం లేదు. కరోనా పూర్తిగా తగ్గిపోయిందని భావన అందరిలోనూ కనిపిస్తోంది.
నిఘా నీడన పరీక్షలు..
సీసీ కెమెరాల నీడలో పరీక్షలు కొనసాగనున్నాయి. కొన్ని కేంద్రాల్లో మాస్ కాఫీయింగ్‌కు అవకాశం ఉండటంతో సీసీ కెమెరాలకు శ్రీకారం చుట్టారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద వీటిని ఏర్పాటు చేశారు. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా ప్రభుత్వ కాలేజీల కంటే ప్రైవేట్ కాలేజీల్లోనే పరీక్షా కేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా కాఫీయింగ్ జరిగే అవకాశాలు తక్కువే.. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పరీక్షలు జరిగే సమయంలో అటువైపు గుంపులు గుంపులుగా జనం గుమిగూడకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న క్వశ్చన్ పేపర్ లీకేజీ వంటి అంశాలను దృష్టిలోపెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం, విద్యాశాఖ పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఎండలతో జాగ్రత్త..
మే నెల కావడంతో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. మధ్యాహ్నం వేళ దాదాపు 40 డిగ్రీలకు పైగానే టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఇక పరీక్షా హాల్‌లో ఉక్కపోత కూడా ఎక్కువే ఉంటుంది. దీంతో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎండలను దృష్టిలోపెట్టుకుని తగిన చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. ఉదయం పెద్దగా ఇబ్బంది లేకపోయినా పరీక్షా రాసి బయటకు వచ్చే సమయంలో ఎండ తీవ్రత ఉంటుంది. పరీక్షా సెంటర్లు దూరంగా ఉన్న వాళ్లు మాత్రం వచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్షా కేంద్రాల వద్ద కూడా వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఎండదెబ్బ తగిలితే వెంటనే వైద్య సహాయం అందించేలా ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు నీటి వసతులు కూడా కల్పించారు.
ఆందోళన వద్దు, ప్రశాంతంగా రాయండి: విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
స్టూడెంట్స్ ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలి. ఇంటర్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేశాం. ఆలస్యం జరగకుండా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయండి. ఇంటర్ విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్..