రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) ఎన్నికలు జులై 6వ తేదీన జరుగుతాయని ఫెడరేషన్ రిటర్నింగ్ అధికారి మహేష్ కుమార్ మిట్టల్ ఇవ్వాల (మంగళవారం) తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడానికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సోమవారం రిటర్నింగ్ ఆఫీసర్ (RO) గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి మిట్టల్‌ను నియమించింది. దీనికి సంబంధించిన వివరాలను జస్టిస్ మిట్టల్ ఇవ్వాల వెల్లడించారు. ఎన్నికల రోజే ఫలితాలు ప్రకటిస్తామని జస్టిస్ మిట్టల్ ఈ సందర్భంగా తెలిపారు. ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేయడానికి ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుండి రెండు నామినేషన్లను స్వీకరించడానికి జూన్ 19న చివరి తేదీగా నిర్ణయించారు. జూన్ 22 నాటికి వీటి పరిశీలన పూర్తవుతుంది.
కాగా, ప్రతి రాష్ట్ర యూనిట్ ఇద్దరు ప్రతినిధులను పంపవచ్చు. ప్రతి ప్రతినిధికి ఒక ఓటు ఉంటుంది. WFI ఎన్నికల కోసం ఎలక్టోరల్ కాలేజీ 50 ఓట్లను కలిగి ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం.. గతంలో ఫెడరేషన్ రద్దు చేసిన కొన్ని రాష్ట్ర సంస్థలు కూడా ఎన్నికల ప్రక్రియలో చేరాలని అభ్యర్థించాయి. ఓటు వేయడానికి ఎవరు అర్హులో నిర్ణయించడానికి అన్ని సంస్థల ఆధారాలను పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని రిటర్నింగ్ అధికారి మిట్టల్ తెలిపారు. ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ జూన్ 23న ప్రారంభమై, జూన్ 25న ముగియనుంది. ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. జూన్ 28న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుందని ఆయన తెలిపారు. అభ్యర్థులు తమ నామినేషన్లను జూన్ 28 నుంచి -జులై 1వ తేదీ మధ్య ఉపసంహరించుకోవచ్చు. ఆ తర్వాత జులై 2వ తేదీన అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
ఇక.. లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుటుంబాన్ని లేదా అతని సహచరులను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతిస్తారా? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అంతకుముందు బ్రిజ్ భూషణ్ కుటుంబ సభ్యులను ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రభుత్వం అనుమతించదని క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లకు హామీ ఇచ్చారు.