Tuesday, November 26, 2024

ప్రపంచంలోనే ఎతైన శివుడి విగ్రహం..250ఏళ్ల పాటు నిలిచి ఉండేలా నిర్మాణం..మరెన్నో ప్రత్యేకతలు

రాజస్థాన్ రాజ్సమంద్ జిల్లాలో ఓ అద్భుతం ఆవిష్కరణ కానుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహాన్ని నెలకొల్పారు. జిల్లాలోని నాథద్వారా పట్టణంలో ఏర్పాటు చేసిన 369 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి, తదితరుల సమక్షంలో గుజరాత్ కు చెందిన ఆధ్యాత్మిక నాయకుడు, మత బోధకుడు మొరారి బాపు భక్తుల సందర్శనార్థం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ అనంతరం అక్టోబర్ 29 నుంచి నవంబర్ 6 వరకు తొమ్మిది రోజుల పాటు రాష్ట్రంలో మతపరమైన, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంస్థాన్ ట్రస్టీ, మిరాజ్ గ్రూప్ చైర్మన్ మదన్ పాలివాల్ తెలిపారు. శ్రీనాథ్ జీ నగరంలో ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన శివుడి విగ్రహం మతపరమైన పర్యాటకానికి కొత్త కోణాన్ని ఇస్తుందని పాలివాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువు మొరారి బాపు కూడా తొమ్మిది రోజుల పాటు రామకథను పఠించనున్నారు. ఉదయ్ పూర్ కు 45 కిలోమీటర్ల దూరంలో ఈ విగ్రహాన్ని తత్ పదమ్ సంస్థాన్ నిర్మించింది. ఈ విగ్రహాన్ని ధ్యాన భంగిమలో ఏర్పాటు చేశారు.

ఈ శివుడి ప్రతిమ 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపిస్తుంది. దీనిని 73,4400 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో కొండపై ప్రతిష్టించారు. ఈ విగ్రహం ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రత్యేక లైట్లను ఏర్పాటు చేశారు. దీంతో చాలా దూరం నుంచి కూడా ఈ శివుడి ప్రతిమ స్పష్టంగా కనిపిస్తుంది. రాగి రంగులో కనిపించే ఈ విగ్రహాన్ని ఎండ, వర్షం నుంచి రక్షించడానికి జింక్ మిశ్రధాతువుతో పూత పూశారు. ఈ విగ్రహం దాదాపు 250 ఏళ్ల పాటు నిలిచి ఉంటుంది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకుంటుంది. ఈ విగ్రహం రూపకల్పనకు సంబంధించిన విండ్ టన్నెల్ పరీక్షను ఆస్ట్రేలియాలో నిర్వహించారు. విగ్రహం చుట్టూ ఉన్న వేదిక బంగీ జంపింగ్, జిప్ లైన్, గో-కార్ట్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పర్యాటకులు ఆస్వాదించడానికి ఫుడ్ కోర్టు, అడ్వెంచర్ పార్క్, జంగిల్ కేఫ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం లిఫ్ట్ లు, మెట్లు, భక్తుల కోసం ఒక హాలును కలిగి ఉంది. విగ్రహం పూర్తి కావడానికి 10 సంవత్సరాలు పట్టింది. 2012 ఆగస్టులో అప్పటికే సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్, మొరారి బాపు సమక్షంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి మూడు వేల టన్నుల ఉక్కు, ఇనుము, 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీట్, ఇసుకను ఉపయోగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement