Friday, November 22, 2024

వర్క్‌ ఫ్రం హోం సరికాదు, ఆఫీసులకొస్తేనే బెటర్మెంట్.. ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి

భారతీయ ఐటీ కంపెనీలు కొనసాగిస్తున్న వర్క్‌ ఫ్రం హోం విషయంలో ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కారణంగా ఐటీ కంపెనీలు అన్నీ వర్క్‌ ఫ్రం హోంను తీసుకొచ్చాయని, కానీ ఈ తరహా పని విధానం భారత్‌లో సత్ఫలితాలు ఇవ్వదని అభిప్రాయపడ్డారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. ఐటీ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఆఫీసులకు పిలిపించుకుంటున్నాయి. ఇప్పటి వరకు వర్క్‌ ఫ్రం హోం చేసిన వారంతా.. కార్యాలయాల గడపలు తొక్కేందుకు సిద్ధం అవుతున్నారు. తాను వర్క్‌ ఫ్రం హోంకు అనుకూలం కాదని నారాయణ మూర్తి స్పష్టం చేశారు. ఉద్యోగులంతా ఇళ్ల నుంచి పని చేస్తుంటే.. కంపెనీ పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పుకొచ్చారు. ఇళ్ల నుంచి పని చేసే వారిలో గతంలో ఉన్న నైపుణ్యం, ప్రతిభ, సృజనాత్మకత తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనికేషన్‌ గ్యాప్‌ అనేది వస్తుందని, దీంతో కంపెనీ అనుకున్న లక్ష్యాలను సాధించలేదన్నారు.

విదేశాల్లో ప్రత్యేక గదులు
తాను వర్క్‌ ఫ్రం హోంకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. భారత్‌లోని చాలా ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ సౌకర్యం లేదని, దీంతో ఉద్యోగులు సరిగ్గా పని చేయలేరన్నారు. విదేశాల్లో అయితే అన్ని ప్రాంతాల్లో ఈ సౌకర్యం ఉంటుందని, అందుకే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కంపెనీలు ఎంతో మంచి ఫలితాలను రాబడుతాయని, ఉద్యోగులు కూడా ఎంతో బాగా రాణిస్తారని చెప్పుకొచ్చారు. విదేశాల్లో వర్క్‌ ఫ్రం హోం ద్వారా పని చేసే ఉద్యోగికి ఇంట్లో ప్రత్యేకమైన గది ఉంటుందని, కానీ భారత్‌లో ఇలాంటి ఇబ్బందులు స్పష్టంగా కనిపిస్తాయని తెలిపారు. కరోనా సమయంలో ఉత్పాదకతలో.. బంగ్లాదేశ్‌తో పోలిస్తే భారత్‌ వెనుకబడిందని గుర్తు చేశారు. మెరుగైన ఫలితాలు సాధించాలంటే.. కచ్చితంగా ఉద్యోగులంతా ఆఫీసులకు వెళ్లాల్సిందే అని చెప్పుకొచ్చారు. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడాలంటే.. భారత్‌ వర్క్‌ ఫ్రం హోంకు స్వస్తి పలికి.. వర్క్‌ ఫ్రం ఆఫీసును కొనసాగించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement