తల్లిదండ్రుల్ని బతికుండగానే కొందరు పిల్లలు చంపేస్తున్నారు. కొందరు వారిని చూడలేమంటూ అనాధాశ్రమంలకు పంపేస్తున్నారు. మరికొందరు బతికుండానే ఇంటి బయటకు ఈడ్చేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్న ఈ సమాజంలో కరోనా మానవ సంబంధాల్ని మరింత మంటగలిపేసింది. నవమోసాలు మోసి కొడుకుల్ని కన్న ఓ మాతృమూర్తికి కరోనా సోకింది. దీంతో ఆ తల్లిని కొడుకులు బయట వదిలేశారు. కరోనాతో ఆ మహిళ కన్నుమూసింది. ఈ ఘటన కరీం నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు భారీగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరీంనగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ రోజులతో పోటీ పడుతోంది. జిల్లాలోని జమ్మికుంటకు చెందిన గంగారపు సుశీల (50) కరోనాతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఐసొలేషన్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఇటీవల కరోనా వచ్చిందని ఇంటి యజమానురాలు ఇంట్లోకి రానివ్వకపోవడంతో నెల 9న ఇంటి నుండి ఒంటరిగా బయటకు వచ్చింది. కన్న కొడుకులు సైతం చేర దియకపోవడంతో మానసికంగా కుంగి పోయిన మహిళ.. పాత అంబేడ్కర్ చౌరస్తాలో రెండు రోజుల పాటు తోపుడు బండిపై తల దాచుకుంది.
ఈ నెల 10న ఆమె దీన స్థితి గమనించిన కాంగ్రెస్ నాయకులు మొలుగు దిలీప్ వైద్యాధికారులు సమాచారం అందించారు. 108వాహనం ద్వారా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు. దీంతో మూడు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సుశీల మృతి చెందింది.