Thursday, November 21, 2024

నారీ శక్తి ప్రబలంగా పుంజుకుంది.. మ‌న్ కీ బాత్ లో ప్ర‌ధాని మోడీ

అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మ‌హిళా శ‌క్తి గురించి.. భార‌త్ కి ఆస్కార్ సాధించిన ఇద్ద‌రు మ‌హిళ‌ల గురించి 99వ ఎడిష‌న్ మ‌న్ కీ బాత్ లో ప్ర‌స్తావించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. అవయవదానంపై అవగాహన పెరగడం, క్లీన్ ఎనర్జీపై ముందడుగు గురించి ప్రధానంగా మాట్లాడారు.అవయవదానం గురించి మాట్లాడుతూ అమృత్‌సర్‌కు చెందిన ఓ కుటుంబంతో ఆయన మాట్లాడారు. మన దేశంలో అవయవదానం గురించి అవగాహన పెరిగిందని వివరించారు. అమృత్‌సర్‌కు చెందిన దంపతులు ప్రాణాంతక కండీషన్‌తో జన్మించి 39 రోజుల తర్వాత మరణించిన తమ బిడ్డ అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ దంపతులతో మోడీ మాట్లాడారు. వారు అవయవదానం నిర్ణయం తీసుకోవడాన్ని ప్రశంసించారు.

2013లో మన దేశంలో అవయవదానం 5,000 సార్లు జరిగిందని, అదే 2022లో ఈ సంఖ్య 15,000కు పెరిగిందని వివరించారు. భారత పురోగతిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని మోడీ అన్నారు. నారీ శక్తి ప్రబలంగా పుంజుకుందని వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఏసియాలోనే తొలి మహిళా లోకో పైలట్‌గా రికార్డు సృష్టించిన సురేఖా యాదవ్‌ను ప్రస్తావించారు. నాగాల్యాండ్‌లో 75 ఏళ్లలో తొలిసారి ఇద్దరు మహిళలు శాసన సభకు ఎన్నికయ్యారని వివరించారు. అంతేకాదు, యూఎన్ మిషన్ కింద పీస్ కీపింగ్ కోసం కేవలం మహిళా ప్లటూన్‌నూ ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రూప్ కెప్టెన్ శైలిజా ధామి కంబాట్ యూనిట్‌లో కమాండ్ అపాయింట్‌మెంట్ పొందిన తొలి మహిళా వైమానిక దళ అధికారిణిగా రికార్డు సృష్టించారని వివరించారు. ది ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమా దర్శక, నిర్మాతలు కార్తికీ గొంజాల్వేజ్, గునీత్ మోంగాల గురించి ప్రధాని మోట్లాడారు. ఈ నెలలోనే వారిద్దరు ఆస్కార్ అవార్డులను భారత్‌కు తెచ్చారని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement