సోషల్ మీడియాలో నెటిజన్‌లను ఆకట్టుకునేందుకు చాలామంది వినూత్నంగా విన్యాసాలు, స్టంట్లు చేస్తారు. యూపీలోని ఘజియాబాద్‌లో ఇద్దరు యువతులు అచ్చం ఇలాగే ఆలోచించారు. ఫేమస్ అవ్వడం కోసం వారు చేసిన బైక్ విన్యాసాలు పోలీసుల కంట పడటంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శివంగి దబాస్ ఇటీవల రెజ్లర్ స్నేహ రఘువన్షితో కలిసి ఓ బైక్ విన్యాసాన్ని చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. రెజ్లర్ స్నేహ బైక్ నడుపుతుండగా ఆమె భుజాలపై శివంగి కూర్చొని ఉండడం గమనార్హం. ఈ దెబ్బకు తన ఫాలోవర్ల సంఖ్య పెరుగుతుందని, మరింత పబ్లిసిటీ వస్తుందని భావించింది. అయితే ఈ వీడియో అధికారుల దృష్టికి వెళ్లడంతో ట్రాఫిక్ నియమ నిబంధనల్ని అతిక్రమించినందుకు రెజ్లర్ స్నేహ తల్లి మంజుదేవి ఇంటికి రూ.11 వేలు ఛలానా పంపారు. అంతేకాదు ఆ అమ్మాయిలకు బైక్ ఇచ్చిన దాని యజమాని సంజయ్ కుమార్‌కు రూ.17 వేల జరిమానా విధించారు.