టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్‌కు స్వాగతం చెప్పేందుకు నేతలు, అధికారులు రోడ్ల వెంబడి మహిళలను నిలబెట్టించి దండాలు పెట్టించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీకి స్వాగతం చెప్పేందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. 2 వేల మంది మహిళలను కిలోమీటర్ పొడవునా చేతిలో మొక్కలతో నిలబెట్టించి దండాలు పెట్టించారు. తర్వాత కేసీఆర్ ఎకో పార్క్‌లో ఎంపీ, మంత్రి మొక్కలు నాటారు.
ఈ నెల 10న మంత్రి కేటీఆర్ నారాయణపేట జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడూ ఇలాంటి సంఘటనే జరిగింది. నారాయణపేట జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనడానికి కేటీఆర్ వెళ్లగా.. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, అక్కడి జిల్లా అధికారులు రోడ్ల వెంబడి అంగన్‌వాడీ మహిళలు, స్వయం సహాయక సంఘాల గ్రూపుల మహిళలతో దండాలు పెట్టించారు. ఈ రెండు కార్యక్రమాల్లోనూ నేతల రాక కోసం మహిళలు గంటల తరబడి వేచి ఉన్నారు. కొంత మంది వృద్ధులు నిలబడలేక కింద కూర్చుండిపోయారు. ఈ సంఘటనలపై తీవ్ర విమర్శలొచ్చాయి. మహిళా సంఘాల సభ్యులను తీసుకొచ్చి టీఆర్ఎస్ నేతల మెప్పు కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. దొరల పాలన అంటే ఇదే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.