నాగార్జున సాగర్ ఉప ఎన్నికల బరిలో కీలక నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం నేటితో ముగిసింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బరిలో 41 మంది నిలిచారు. ఈ ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొత్తం 77 నామినేషన్లు దాఖలు కాగా, పలు కార ణాలతో 17 మంది నామినేషన్లు తిరస్కరించారు. 19 మంది అభ్యర్థులు నామినేషన్స్ ఉపసంహరించుకున్నారు. దీంతో ఉపఎన్నికల బరిలో మొత్తంగా 41 మంది అభ్యర్థులు నిలిచారు. అభ్యర్థులెవరనేది నికరంగా లెక్కతేలడంతో సాగర్ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. బీజేపీ సాగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి నివేదితారెడ్డి, ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థి కుతుబుద్ధిన్‌లు తిరస్కరణ జాబితాలో ఉన్నారు. ఏప్రిల్ 17న సాగర్ ఉప ఎన్నికల జరగనుంది.
మరోవైపు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీ అభ్యర్థులు ప్రచారంతో దూసుకుపోతున్నారు. సాగర్ సమరంలో సై అంటే సై అంటున్నారు. కాంగ్రెస్ నేత జానా రెడ్డి, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుంది అనేలా నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.
గత నెల 27న హాలియాలో జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రచారంలో ఊపు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రచార గడువు ముగిసేలోపు మరోమారు నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తోంది. చివరి వారం రోజుల్లో నియోజకవర్గాన్ని చుట్టుముట్టి పోలింగ్‌కు ఉత్సాహంగా సిద్ధం కావాలని నేతలు భావిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ సైతం దూకుడు పెంచింది. సీఎం కేసీఆర్ కూడా సభ నిర్వహించే అవకాశం ఉంది.