Tuesday, November 19, 2024

Cheating Lady : పోలీస్‌ నకిలీ ఐడీ కార్డుతో.. ముగ్గురితో ప్రేమాయణం…ఉద్యోగాలంటూ మోసం..

హైదరాబాద్: పోలీస్‌ కానిస్టేబుల్‌ అంటూ ఏకంగా నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం కేంద్రంగా ఓ యువతి అనేక మందిని ఉద్యోగాల పేరుతో మోసం చేసింది. అంతేకాకుండా ముగ్గురిని ప్రేమించి పెళ్లి చేసుకుని వారితో బలవంతంగా చోరీలు చేయిస్తోంది. ఈ మాయలేడీని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు లంగర్‌హౌస్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్‌హౌస్‌లో నివాసముండే అశ్విని ఇంటర్‌ వరకు చదువుకుంది. జల్సాలకు అలవాటు పడిన ఈ యువతి తన పేరును అశ్వినిరెడ్డిగా మార్చుకొని తాను హైదరాబాద్‌ పరిధిలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు ఫేక్‌ ఐడీ కార్డును తయారు చేసింది. అనంతరం ఈసీఐఎల్‌లో నివాసముండే రోహిత్‌కిషోర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఒక కూతురు, కుమారుడు సంతానం. నాలుగేళ్ల తర్వాత మరో యువకుడు రోహిత్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. మొదటి భర్తను చంపాలని ప్రయత్నం చేసింది. డబ్బుల కోసం ఈ ఇద్దరినీ చోరీలు చేయాల్సిందిగా బలవంతపెట్టసాగింది. ఈ క్రమంలో చోరీలకు పాల్పడి రోహిత్‌ జైలు పాలయ్యాడు. ప్రస్తుతం అశ్విని మెహిదీపట్నంలో నివాసముంటూ అభిషేక్‌తో సహజీవనం కొనసాగింది.

పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం కేంద్రంగా పోలీసు నకిలీ ఐడీ కార్డును తయారు చేయించిన అశ్విని ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అనేక మంది వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసింది. దీనికి రాపిడోను ఎంచుకొని ఆ వాహనంపై ప్రయాణిస్తూ యువకులను వలలో వేసుకుంది. వారి వాహనంపై బషీర్‌బాగ్‌లోని పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయం వద్దకు వెళ్లేది.. అక్కడ ఆ యువకులను బయట ఉంచి లోపలికి వెళ్లేది. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి పని పూర్తయిందని లేదా సార్‌ బయటకు వెళ్లాడని చెబుతూ వచ్చేది. ఒక్కొక్కరి వద్ద వేలాది రూపాయలు వసూలు చేసిన ఈ కిలేడీ చివరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కింది. తనకు పెళ్లి కాలేదని అశ్విని మోసం చేసిందంటూ అభిషేక్‌ కొద్ది రోజుల క్రితం పోలీసుల సమక్షంలో చెప్పి వెళ్లిపోయాడు. ప్రస్తుతం తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, తనతో ఉండట్లేదు అంటూ అశ్విని అతనిపై ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం గమనార్హం…!!

Advertisement

తాజా వార్తలు

Advertisement