హైదరాబాద్, ఆంధ్రప్రభ: కర్ణాటకలో అధి కారాన్ని చేజార్చుకున్న బీజేపీ… తెలంగాణ లోనూ ప్రతికూల పరిస్థితులు ఎదురుకాకుం డా జాగ్రత్త పడుతోంది. ముఖ్యంగా అసెంబ్లి ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల మధ్య సయోధ్య, సమన్వయానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. పార్టీలో చేరికలు, అసెంబ్లి ఎన్నికల్లో పొత్తులు, రాష్ట్రంలో పార్టీ పదవులపై ఇటీవల కీలక నేతలు తలా ఒక మాట మాట్లాడుతుండ డంపై ఆ పార్టీ అధిష్టానం ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ఎన్నికల ముందు కీలక నేతల మధ్య సమన్వయం లోపించడం పార్టీని దెబ్బతీయడం ఖాయమన్న నిర్ణయానికి అధి ష్టానం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పార్టీని రాష్ట్రంలో పునర్‌వ్యవస్థీకరణ చేయడంతోపాటు బాధత్యలను కూడా నేతల మధ్య పంపిణీ చేయాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీ నేతలకు ఢిల్లి అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు పార్టీలోని కిందిస్థాయి నేతలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల ముందు కీలక పదవుల బాధ్యతలను నేతలకు అప్పగించే అవకాశం ఉందని, తెలంగాణ అసెంబ్లిd ఎన్నికల టీమ్‌ను కూడా అధిష్టానం ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో మూడు నాలుగు రోజుల్లో తెలంగాణ బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతోపాటు అగ్రనేత అమిత్ షా ఢిల్లిలో ప్రత్యేకంగా భేటీ కానున్నారని తెలిసింది. త్వరలోనే ప్రచార, హామీల, మేనిఫెస్టో, క్రమశిక్షణా తదితర కమిటీలను కొత్త నేతలతో అధిష్టానం భర్తీ చేయనున్నట్లు కూడా చర్చ సాగుతోంది. తెలంగాణ ఉద్యమంలో, రాజకీయాల్లో సీనియర్ నేత అయిన ఈటల రాజేందర్‌కు ఎన్నికల వ్యూహాల ఖరారు కమిటీ లేదా ప్రచార కమిటీ వంటి కీలక బాధ్యతలను అప్పగించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా… అసెంబ్లి ఎన్నికల్లో అవలంభించాల్సిన విధివిధానాలపైనా, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపైనా పలువురు నేతల అభిప్రాయాలను బీజేపీ అధిష్టానం తెలుసుకోనుంది. ఇప్పటికే పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వరరెడ్డి అధిష్టానం పెద్దలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి, ఎన్నికల నేపథ్యంలో చేయాల్సిన మార్పులు చేర్పులపైనా వారు అధిష్టానానికి వివరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మూడు నాలుగు రోజుల్లో తెలంగాణ బీజేపీలోని కీలక నేతలతో ఢిల్లిdలో అధిష్టానం పెద్దలు అమితో షా, జేపీ నడ్డా, తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్ సమావేశం కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎవరెవర కీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించబోతోంది, అధికార బీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు ఎలాంటి కార్యాచరణను అమలు చేయబోతుందనేది పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశమైంది.