ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసే కొద్దిగంటల ముందు రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రానుందని ఎస్‌పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తమ కూటమికి 300 స్ధానాలు దక్కుతాయని అఖిలేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. తుది విడత పోలింగ్‌లో తూర్పు యూపీలో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. అఖిలేష్ సోమవారం ఓ వార్తాచానెల్‌తో మాట్లాడుతూ కాషాయ పార్టీకి ఎన్నికల్లో భంగపాటు తప్పదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలందరూ అసత్యాలు మాట్లాడారని, ఈ స్ధాయిలో ఏ ఇతర రాజకీయ పార్టీ అసత్యాలు ప్రచారం చేయలేదని ఆరోపించారు.
కాషాయ నేతలు నిరుద్యోగం, పేదరికం గురించి ఎక్కడా ప్రస్తావించలేదని మండిపడ్డారు అఖిలేశ్. ఉద్యోగాల కోసం యువత ఐదేండ్లు వేచిచూసిందని, రైతాంగాన్ని ప్రభుత్వం ఎలా వేధించిందో ఎవరూ మరిచిపోరని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలని, బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని చెప్పారు. డీజిల్, పెట్రోల్ ధరలు ఎందుకు మండుతున్నాయో, ఎల్పీజీ సిలిండర్ ధర ఎందుకు రూ. వేయి పలుకుతుందో బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. బీజేపీ ఐదు ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మిస్తామని హామీ ఇవ్వగా అవి ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. యూపీలో మిసైల్స్ తయారీ చేపడతామని కాషాయ పార్టీ నేతలు అసత్యాలు వల్లించారని దుయ్యబట్టారు. యూపీలో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.