Tuesday, November 26, 2024

కన్నుల పండువగా వింగ్స్‌ ఇండియా ఏవియేషన్ షో – అతిథ్యమిస్తున్న తెలంగాణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వింగ్స్‌ ఇండియా ఏవియేషన్‌ ప్రదర్శన – 2022 అట్టహాసంగా ప్రారంభమైంది. ఇక్కడి బేగంపేట విమానాశ్రయంలో నాలుగు రోజులపాటు ఈ షో జరగనుంది. పౌర విమానయాన మంత్రిత్వశాఖ, ఫిక్కీ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కరోనా వల్ల గడిచిన రెండేళ్ల పాటు పౌర విమానయాన రంగం కఠినమైన సవాళ్లు ఎదుర్కోవడంతో ఈ ప్రదర్శనకు తాత్కాలిక విరామం ఇచ్చారు. దీనికి తోడు ఇంధన ప్రపంచిక ఒత్తిడి పరిస్థితుల్లో ఏవియేషన్‌ మార్కెట్‌ మరింత ప్రభావితమవుతోందని విమానయాన నిపుణులు చెబుతున్నారు. ఏవియేషన్‌ ప్రదర్శన మొదటి రోజు బీటుబీ సమావేశాల్లో భాగంగా ఎయిర్‌బస్‌, ప్రాట్‌ అండ్‌ విట్నీ కంపెనీలు భారత విమానయాన రంగంతో తమ భాగస్వామ్యం, భవిష్యత్‌ ప్రణాళికలపై చర్చించారు. రాబోయే ఇరవై ఏళ్లలో 2210 విమానాలను భారత్‌కు అందజేస్తామని ఎయిర్‌బస్‌ ప్రకటించింది. భారత్‌ తమకు కీలక వ్యాపార భాగస్వామి అని పేర్కొంది. ప్రముఖ విమాన ఇంజన్ల తయారీ సంస్థ ప్రాట్‌ అండ్‌ విట్నీ ఈ ఏడాది ఏప్రిల్‌కల్లా బెంగళూరులో తమ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. వింగ్స్‌ ఇండియా ఏవియేషన్‌ షోలో భాగంగా ఎయిర్‌బస్‌ 350 ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సందర్శకుల కోసం సారంగ్‌ టీమ్‌ చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకర్షించాయి. కాగా ఏవియేషన్‌ షో ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా శుక్రవారం ప్రారంభించనున్నారు. విమానయాన రంగం భవిష్యత్తుపై రెండు రోజులపాటు బేగంపేట విమానాశ్రయంలో రౌంట్‌ టేబుల్‌ సమావేశాలు జరగనున్నాయి. పలు విధాన నిర్ణయాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు.

ఈ షోలో వివిధ దేశాలకు చెందిన విమానాల ప్రదర్శతో పాటు బిజినెస్‌ ఒప్పందాలు, పెట్టుబడుల ప్రకటనలు, రీజినల్‌ కనెక్టివిటీ అంశాలపై చర్చించనున్నారు. ఈ దఫా ప్రధానంగా హెలికాప్టర్‌ పాలసీ, డ్రోన్‌ పాలసీ, ఎంఆర్‌వో పాలసీ, ఫ్లైయింగ్‌ ట్రాకింగ్‌ ఆర్గనైజేషన్‌ పాలసీలపై చర్చించనున్నారు. ప్రదర్శన చివరి రోజు సివిల్‌ ఏవియేషన్‌ మంత్రిత్వశాఖ ఆధ్వర్వంలో ఏవియేషన్‌ కంపెనీలు, సంస్థలకు అవార్డులను బహూకరించనున్నారు. కోవిడ్‌ కారణంగా గత ఏడాది కేవలం బిజినెస్‌ మీట్‌కే పరిమితమైన ఈ షో ఈసారి సందడి చేయనుంది. ఏయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో పాటు పలు ప్రభుత్వ విభాగాలు, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ వంటి సంస్థలు ఈ షోలు పాలుపంచుకోనున్నాయి. బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రార్స్‌ సంస్థ నుంచి సరికొత్త ఎయిర్‌బస్‌ 350, అతిపెద్ద కమర్షియల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇ195-ఈ2 విమానాలు ఈ షోలో కొలువదీరనున్నాయి. భారత వైమానిక దళానికి చెందిన సారంగ్‌ టీమ్‌ ఆధ్వర్యంలో ఎరోబ్యాటిక్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఏవియేషన్‌ హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్‌ గత కొన్నేళ్లుగా ఈ వేడుకకు అతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement