Sunday, November 17, 2024

బస్సుని ఢీ కొన్న విమానం రెక్క.. డ్రైవర్ తో పాటు ప్రయాణికులకు గాయాలు

పాత ఎయిర్ బస్ A320 రెక్కలు, ఇతర భాగాలను తిరువనంతపురం నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళుతున్నారు. ఈ విమానం 30 ఏళ్ల పాటు విమానయాన సర్వీసులో పనిచేసింది. 2018లో ఈ విమానాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలోని హ్యాంగర్ యూనిట్‌లో ఉంచారు. గత నాలుగు సంవత్సరాలుగా.. ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ విమానాన్ని అధ్యయనం కోసం ఉపయోగిస్తున్నారు. మారుతున్న సాంకేతిక నేపథ్యంలో ఈ విమానం అధ్యయనానికి పనికిరాకపోవడంతో, అధికారులు దానిని స్క్రాప్‌కు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వేలం వేశారు. ఆ వేలంలో హైదరాబాద్ కు చెందిన జోగిందర్ సింగ్ రూ. 75 లక్షలకు విమానాన్ని కొనుగోలు చేశారు. ఈ విమానాన్ని అనేక భాగాలుగా విడదీసి నాలుగు ట్రైలర్లలో హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది. రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సును ట్రక్కులో ప్రయాణిస్తున్న విమానం రెక్క బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద అనంతరం ట్రైలర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. ట్రైలర్‌ను తొలగించడంలో పోలీసులు విఫలయత్నం చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో ట్రైలర్‌ డ్రైవర్‌ వచ్చి ట్రైలర్‌ను తొలగించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement