వరంగల్, (ప్రభ న్యూస్): వరంగల్ జిల్లాలో గాలి దుమారం చెలరేగింది. ఉరుములు, మెరుపులతో వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వాన ఓరుగల్లు వాసులను అతులకూతులం చేసింది. శనివారం సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని చల్లటి గాలులు వీచిన మరుక్షణమే గాలి దుమారం చెలరేగింది. వెనువెంటనే అర గంటకు పైగా బోరుమని వర్షం కురిసింది. గాలి దుమారం బీభత్సానికి వరంగల్ నగరంలోని అనేక కాలనీలోని ఇళ్లపై ఉన్న రేకులు కొట్టుకుపోయాయి.
నర్సంపేట మెయిన్ రోడ్డు లోని దుకాణాల ముందు షెడ్లు నేల మట్టం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు నెల కూలాయి. మరికొన్ని ఏరియాలోని పురాతన కాలం నాటి మట్టి గోడలతో నిర్మించిన ఇళ్ళు కుప్పకూలిపోయాయి. మిల్స్ కాలనీ, లేబర్ కాలనీ, ఎన్ఠీఆర్ నగర్, బాలాజీ నగర్ ఏరియాల్లో నష్టం వాటిల్లింది.
నిలిచి పోయిన విద్యుత్తు సరఫరా..
గాలి దుమారం సృష్టించిన బీభత్సంతో వరంగల్ నగరమంతా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. శివనగర్ ఏ ఈ పరిధిలో 20 విద్యుత్తు స్తంభాలు విరిగిపోయాయి. సబ్ స్టేషన్ పరిధిలో కరెంట్ లేకపోవడంతో ప్రజలంతా చీకట్లోనే మగ్గిపోయారు. దశల వారీగా విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తున్నారు.