తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యమంటూ కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా ఉంది. జులై 8న పార్టీ పేరు ప్రకటించేందుకు రెడీ అవుతున్న ఆమెకు.. ఆ వెంటనే అసలైన అగ్ని పరీక్ష ఎదురుకాబోతోంది. త్వరలో హుజురాబాద్‌కు ఉప ఎన్నిక జరనుంది. అయితే, కొత్త పార్టీ పెట్టబోతున్న షర్మిల.. తమ పార్టీ అభ్యర్థిని బరిలో దింపుతారా? లేదా పోటీకి దూరంగా ఉంటారా? లేక మరేదైనా పార్టీకి మద్దుతు ఇస్తారా? అన్నది ఆసక్తిరేపుతోంది.
షర్మిల తెలంగాణలో పార్టీ పెడతానని ప్రకటించగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేకానేక అనుమానలు వ్యక్తం అయ్యాయి. టీఆర్ఎస్కు బీ టీమ్ అని కొందరు.. బీజేపీ వ్యూహంలో భాగామని మరికొందరు.. ఏపీ సీఎం వైఎస్ జగనే కేసీఆర్‌పై పరోక్షంగా వదులుతున్న బాణం అని ఇంకొందరు.. ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే, ఇప్పటికీ ఆమె ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై, అటు సొంత అన్న జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగురాష్ట్రాల జలవివాదంపై షర్మిల స్పందిన ఏపీ ప్రజలకు ఆశ్చర్యానికి గురి చేసింది. తెలంగాణ ప్రయోజనాలకు వదులుకోమని, ఈ ఏవరితోనైన పోరాటం చేస్తానని ప్రకటించారు.
అయితే ఇప్పుడు తన నిజాయతీకి స్వీయ పరీక్ష పెట్టుకునే అవకాశం హుజురాబాద్ ఉప ఎన్నిక ద్వారా వచ్చింది. దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జులై 8 పార్టీ పేరు ప్రకటించబోతున్న షర్మిల.. హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తారా ? అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. పార్టీ నిర్మాణం కాలేదన్న కారణంతో పోటీకి దూరంగా ఉంటారా? లేక ముందుకెళ్తారా? అన్న దానిపై అందరి దృష్టి నెలకొంది. ఒకవేళ ఆ రెండూ కాకుండా మరేదైనా పార్టీకి మద్దతు ప్రకటిస్తారా? అన్నది కాస్త ఉత్కంఠను కలిగిస్తోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా అనంతరం ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, ఆయన మాత్రం బీజేపీలో చేరి ఆపార్టీ తరుపున హుజురాబాద్ బరిలో దిగుతున్నారు.
ఇప్పుడు షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా.. అది ఆమె పార్టీ భవిష్యత్‌పై ప్రభావం చూపుతుంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో సైలెంట్‌గా ఉంటే.. బీజేపీకో, టీఆర్ఎస్కో బీ టీం కాబట్టే సైలెంట్‌గా ఉండిపోయిందని అనే సంకేతం ప్రజల్లో వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు హుజురాబాద్ పోటీ చేస్తే.. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఆమెకు డిపాజిట్ కూడా దక్కుతుందా ? అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నిక షర్మిలకు ఒక అగ్ని పరీక్షే కానుంది. మరి దీనిని షర్మిల ఎలా అధిగమిస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల సీఎంల తీరుతో నష్టం.. కేంద్రానికి బండి సంజయ్ లేఖ