Thursday, November 21, 2024

Big Story: మామునూరుకు మంచిరోజులు వ‌చ్చేనా.. ఓరుగ‌ల్లుకు విమ‌నయానం ద‌క్కేనా?

ఒక్కప్పుడు దేశంలో అతిపెద్ద విమానాశ్రయంగా వరంగల్‌ మామునూర్‌ ఎయిర్‌పోర్ట్‌కు గుర్తింపు ఉన్నది. వరంగల్‌ మీదుగా దేశ నలుమూలలకు విమాన సర్వీసులు ఆపబడ్డాయి. వ్యాపార సంబంధాలతో వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుండి సోలాపూర్‌, సిర్పూజ్‌ కాగజ్‌నగర్‌ ప్రాంతాలతో పాటు ఇతర సుదూర ప్రాంతాలకు విమాన సర్వీసులు నడిచాయి. 1930లో చివరి నిజాం అయిన మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ మామునూర్‌ ఎయిర్‌పోర్ట్‌ను ఏర్పాటుచేశారు.

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: తెలంగాణలో వరంగల్‌ మామునూర్‌ ఎయిర్‌పోర్ట్‌తో పాటు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ మాత్రమే ఉన్నాయి. 1930 నుంచి 1981 వరకు మామునూర్‌ ఎయిర్‌పోర్ట్‌ వినియోగంలో ఉంది. వాణిజ్య సేవలతో పాటు రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు మామునూర్‌ ఎయిర్‌పోర్ట్‌ను వినియోగించుకున్నారు. అదేవిధంగా 1962 భారత్‌ – చైనా యుద్ధం జరిగినప్పుడు మామునూర్‌ ఎయిర్‌పోర్ట్‌ను వినియోగించి ప్రయాణికులకు సేవలు అందించారు. వరంగల్‌లో అతిపెద్ద వస్త్ర పరిశ్రమ అయిన అజంజాహి మిల్లు మూతబడిన తర్వాత వ్యాపారాలకు, వాణిజ్య సేవలు తగ్గిపోయాయి. క్రమంగా ఎయిర్‌పోర్ట్‌ మూతబడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మామునూర్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభించాలనే డిమాండ్‌ బలంగా ముందుకు వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జీఎంఆర్‌ మధ్యన మామునూర్‌ ఎయిర్‌పోర్ట్‌ వినియోగంలోకి రాలేకపోతున్నదనే విమర్శలు పెద్దఎత్తున వస్తున్నాయి.

అన్యాక్రాంతమైన ఎయిర్‌పోర్ట్‌ భూములు
1930లో మామునూర్‌ ఎయిర్‌పోర్ట్‌ను ఏర్పాటు చేసినప్పుడు 1875 ఎకరాల భూములు కేటాయించారు. భూముల పరిరక్షణకై సరైన దృష్టిలేకపోవడంతో భూములన్నీ కబ్జాలకు గురయ్యాయి. సుమారు 1100 ఎకరాల భూములు కబ్జాకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం 700 ఎకరాల భూమి మాత్రమే ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధీనంలో ఉన ్నది. అన్యాక్రాంతమైన భూముల్లో కొన్ని ఇండ్ల నిర్మాణాలు ఉండగా, మరికొంత భూములను ఇతర అవసరాలకు వాడుతున్నారు. అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు.

ప్రస్తుతం 1.8 కిలోమీటర్లు రన్‌వే మాత్రమే ఉన్నది
మామునూర్‌ ఎయిర్‌పోర్ట్‌కు ప్రస్తుతం 1.8 కిలోమీటర్ల రన్‌వే ఉన్నది. ఈ రన్‌వేపై కేవలం డొమెస్టిక్‌ ప్లైట్లు మాత్రమే నడిపించవచ్చు. హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరంగా విస్తరించడంతో భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరంగల్‌ కేంద్రంగా అంతర్జాతీయ విమానాలను నడిపించాలన్నది కేసీఆర్‌ దూరదృష్టి.
ఇంటర్‌నేషనల్‌ ఫ్లైట్స్‌ ల్యాండింగ్‌ కావాలంటే 3.9 కిలోమీటర్ల రన్‌వే అవసరం ఉంటుందని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న రన్‌వేను 3.9 కిలోమీటర్లకు పెంచాలంటే మరో 300 నుంచి 400 ఎకరాల భూములు సేకరించాలని సూచించారు. ఈనెల 7న వరంగల్‌ పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ాంవు, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్‌, నన్నపునేని నరేందర్‌, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు రాజీవ్‌శర్మ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులతో సమావేశమయ్యారు. త్వరలోనే అవసరమైన భూసేకరణ చేపడతామని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ అధికారులకు తెలిపారు.

మోకాలడ్డుతున్న జీఎంఆర్‌
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ”ఉడాన్‌” పథకం క్రింద చిన్న పట్టణాలకు, నగరాలకు విమానయాన సేవలు అందించాలని నిర్ణయం తీసుకున్నది. అందులో వరంగల్‌ మామునూర్‌ ఎయిర్‌పోర్ట్‌తో పాటు కొత్తగూడెం, అదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ను జీఎంఆర్‌కు అప్పజెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో 150 కిలోమీటర్ల పరిధి వరకు ఎక్కడా కూడా కొత్త ఎయిర్‌పోర్ట్‌లను ఏర్పాటు చేయవద్దనే ఒప్పందం చేసుకున్నారు.

- Advertisement -

హైదరాబాద్‌- వరంగల్‌ మధ్య 150 కిలోమీటర్లు మాత్రమే ఉండటంతో వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు జీఎంఆర్‌ అడ్డుచెబుతున్నదనే ప్రచారం జరుగుతోంది. దీంతో వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు అడుగులు పడకపోవడం ఓ కారణంగా చూపిస్తున్నారు.
వాస్తవానికి వరంగల్‌లో 2016లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేసిన సందర్బంéలో దేశీయ, విదేశీ కంపెనీలు వరంగల్‌కు రాబోతున్నాయని, అంతర్జాతీయంగా కంపెనీలు రావాలంటే విమాన సర్వీసులు ఉండాలని చెబుతూ త్వరలోనే వరంగల్‌ మామునూర్‌ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభిస్తామనే ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రకటనతో వరంగల్‌ ప్రజల్లో ఎయిర్‌పోర్ట్‌ వస్తుందనే ఆశలు పెరిగాయి. దీనికి తోడు ఉడాన్‌ పథకం క్రింద కేంద్రం కూడా చిన్న పట్టణాలకు ఎయిర్‌పోర్ట్‌ సేవలు అందిస్తామనే ప్రకటనలు బలం చేకూర్చినట్లయింది.

సమస్యగా మారిన భూసేకరణ
మామునూర్‌ ఎయిర్‌పోర్ట్‌కు క్లియరెన్స్‌ రావాలంటే ఖచ్చితంగా మరో 300 నుంచి 400 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉన్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూముల ధరలకు రెక్కలొచ్చాయి. మారుమూల ప్రాంతాల్లో కూడా ఎకరం 15 నుంచి 20లక్షల రూపాయల ధర పలుకుతోంది. మామునూర్‌ ప్రాంతంలో భూముల ధరలు 30 లక్షల నుంచి 50 లక్షలకు పైగా పలుకుతున్నాయి. 300 నుంచి 400 ఎకరాల భూసేకరణ చేయాలంటే ఖర్చుతో కూడుకోవడంతో అడుగులు ముందుకు పడటంలేదు. అయితే కేటీఆర్‌ పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులతో సమావేశమైనప్పుడు భూసేకరణ సమస్య ముందుకొచ్చింది. మామునూర్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రక్కన మామునూర్‌, బొల్లికుంట, నక్కలపల్లి తదితర గ్రామాల రైతుల భూములు ఉన్నాయి. ఆ పక్కనే ప్రభుత్వ భూమి కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రైతులకు ప్రభుత్వ భూములను అదల్‌… బదల్‌ ఇవ్వడంతో పాటు కొంత పరి హారాన్ని ఇచ్చి భూసేకరణ చేపట్టాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు వరంగల్‌ కలెక్టర్‌కు కేటిఆర్‌ సూచించారు. త్వరలోనే రైతులతో సమావేశం ఏర్పాటుచేసి భూసేకరణకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

రాజకీయాస్త్రంగా మారిన మామునూర్‌ ఎయిర్‌పోర్ట్‌
అధికార, ప్రతిపక్ష పార్టీలకు మామునూర్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం అనేది ఒక రాజకీయాస్త్రంగా మారింది. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ఎయిర్‌పోర్ట్‌కు అనుమతి ఇవ్వడంలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు చేస్తే… కేంద్ర మంత్రులు ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన భూసేకరణ చేయకుండా ఎలా ప్రారంభిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రతిపక్షాలకు ఎన్నికల స్టంట్‌గా మామునూర్‌ ఎయిర్‌పోర్ట్‌ మిగిలిపోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులతో మాట్లాడి భూమి అదల్‌… బదల్‌కు ఒప్పించడంతో పాటు వారు కోరిన పరిహారం ఇచ్చినట్లయితే భూసేకరణకు మార్గం సుగమం అవుతుంది. మామునూర్‌ ఎయిర్‌పోర్ట్‌ కూడా వస్తుంది. వరంగల్‌ ప్రజల విమానయాన కల నెరవేరుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement