తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. గతంలో అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆమె.. ఆ పార్టీపై తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారు. అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలైన తర్వాత శశికళ అన్నాడీఎంకే పగ్గాలు పుచ్చుకుంటారని అందరూ భావించినప్పటికీ, ఆమె అనూహ్యంగా మనసు మార్చుకున్నారు. ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నిక లకు ముందు శశికళ..అంతర్గతపోరు కారణంగా పార్టీ నాశనమైపోవడం తాను చూడలేననీ, రాజకీయాల నుంచి దూరంగా ఉంటానని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఎక్కడా కనిపించలేదు. అయితే, ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీ ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది.
దీంతో శశికళ దృష్టి తిరిగి రాజకీయాలపై పడిందని సమాచారం. తాను మళ్లీ వచ్చేస్తానని మద్దతుదారులకు చూచాయగా చెప్పినట్టు తెలుస్తోంది. అంతర్గత కుమ్ములాటలతో పార్టీ నాశనం అవుతూ ఉంటే చూస్తూ కూర్చోలేనని, తానొచ్చి పార్టీని గాడిలో పెడతానని మద్దతుదారులతో చెప్పినట్టు సమాచారం. ‘‘ ఎవరికి ఎలాంటి ఆందోళన అవసరం లేదు.. పార్టీ విషయాలను తప్పకుండా చక్కబెడతాను.. ధైర్యంగా వుండండి.. కరోనా సెకెండ్ వేవ్ ముగిసిన తర్వాత నేను మళ్ళీ వస్తాను’’ అంటూ శశికళదిగా చెబుతున్న ఓ ఆడియో టేపు తమిళనాట సంచలనం రేపుతోంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
జయలలిత మరణా నంతరం 2016లో శశికళ ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి అయ్యారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే అనూహ్యంగా అక్రమాస్తుల కేసులో 2017 ఫిబ్రవరిలో అరెస్టయి జైలుకు వెళ్లిన శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ పార్టీపై పట్టు కోల్పోయారు. అనంతరం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆమె జైలు నుంచి విడుదల కావడంతో సర్వత్ర ఉత్కంఠ రేపింది. మళ్లీ అన్నాడీఎంకే పార్టీలో చేరుతారని పార్టీని హస్తగతం చేసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే, అనేక పరిణామాల తర్వాత ఆమె రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.