తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఎంపీ రేవంత్ రెడ్డి ఎంపిక తర్వాత కాంగ్రెస్ శ్రేణులు జోష్‌లో ఉంటే.. అసంతృప్తి నేతలు మాత్రం బాధలో మునిగిపోయారు. పీసీసీ తమకే వస్తుందన్న గంపెడు ఆశలు పెట్టుకున్న నాయకులు పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే, ఇన్నాళ్లు నాయకత్వ లోపంతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డే ఆశకిరణంగా కనిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న తెలివైన నిర్ణయం ఏదైనా ఉందా అంటే అది రేవంత్ ను పీసీసీ చీఫ్ చేయడమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పార్టీ అధ్యక్షుడైన రేవంత్‌కు ప్రధానం రెండు, మూడు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. అందులో ప్రధానంగా పార్టీ నాయకుల అసంతృప్తిని చల్లార్చడం.
రేవంత్ రెడ్డిని పార్టీ చీఫ్‌గా ప్రకటించగానే.. కొందరు సీనియర్ నాయకులు పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. రేవంత్‌కు అలా ఎలా పీసీసీ ఇస్తారంటూ బాహటంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బయటివాళ్లకు పీసీసీ ఇస్తే ఊరుకోబోమన్న వీహెచ్.. పీసీసీ పదవి కోసం చివరి వరకూ పోటీపడిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అధ్యక్ష పదవి ఇవ్వకపోతే బీజేపీలోకే అంటూ చెప్పిన రాజగోపాల్ రెడ్డి, పార్టీలో ఉండాలా ? వద్దా? అని ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకునే జగ్గారెడ్డి వంటి నేతలతో పాటు తన నాయకత్వాన్ని విబేధించే మిగిలిన వారితో రేవంత్ రెడ్డి ఎలా సఖ్యత సాధిస్తారు?వారిని కలుపుకొని ముందుకు ఎలా సాగుతారన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.
ఇక, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆధిపత్య పోరు రేవంత్ రెడ్డి ముందున్న మరో అతి పెద్ద సవాల్. కాంగ్రెస్‌లో ఎవరిని అధ్యక్షుడిగా చేసినా.. ఆ పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా మరో వర్గం ఏర్పడడం గతంలో నుంచే ఉంది. ఇప్పటికీ ఆ పార్టీలో రెండు, మూడు వర్గాలు ఉన్నాయి. సీనియర్, జూనియర్ అనే బేదాలు, రెడ్డి, బీసీ అంటూ మరో వర్గం కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కనిపిస్తుంది. పీసీసీ లాంటి కీలక పదవురు రెడ్డి వర్గానికి ఇచ్చినప్పుడు ప్రతిసారి బీసీ నేతలు అలక వహించే వారు. బీసీలకే పీసీసీ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ డిమాండ్ చేశారు. గతంలో ఉత్తమ్, ఇప్పుడు రేవంత్ ఇద్దరూ రెడ్డి సమాజిక వర్గానికి చెందిన వారినే పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడంతో బీసీ వర్గాలు అసంతృప్తికి గురవుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ సమస్యను రేవంత్ ఎలా ఎదుర్కొంటారు? అన్నది కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వేధిస్తున్న సమస్య కోవర్టులు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారని గతంలో చాలా మంది నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ వ్యూహాలను ముందుగానే టీఆర్ఎస్ పార్టీ లీక్ ఇవ్వడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో కొనసాగే నేతలు.. అధికారపార్టీ పల్ల విధేయత చూపిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపించాయి. సో ఇలాంటి వారిపై రేవంత్ రెడ్డి ఏవిధంగా దృష్టి పెడతారు? వారిని పార్టీ కార్యక్రమాలు దూరం పెడతారా? లేక కలుపుకొని వెళ్తారా? అన్నది ఉత్కంఠగా మారింది.
ఇది కూడా చదవండి: కేసీఆర్ ను గద్దె దించుతాం: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి..