దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ పంజా విసురుతోంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసులు కొత్త రికార్డ్ సృష్టిస్తున్నాయి. అలాంటి రాష్ట్రాల జాబితాలో కర్ణాటక కూడా చేరిపోయింది. గత కొంతకాలంగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరు సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కర్ణాటక సర్కార్ లాక్‌డౌన్ కూడా విధించే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప సంకేతాలు ఇచ్చారు.
కర్ణాటకలో కరోనా విజృంభిస్తోంది. కొవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 10,250 కేసులు నమోదు అయ్యాయి. అందులో 7,584 కేసులు బెంగళూరులోనే రికార్డు అయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. మరో వారం రోజుల్లో కొవిడ్ కేసులు తగ్గకపోతే లాక్ డౌన్ విధించే అంశంపై ఆలోచిస్తామని అన్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే లాక్‌డౌన్ విధిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు తమ ఆరోగ్యం కోసం, ప్రాణాల కోసం కచ్చితంగా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని, అలా కుదరని పక్షంలో తాము కఠిన నిబంధనలు విధించాల్సి ఉంటుందని తెలిపారు.
తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీకి కూడా వివరించామని సీఎం యడియూరప్ప తెలిపారు. కోవిడ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నామని పేర్కొన్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా కేసుల సంఖ్య పెరిగితే అక్కడ కూడా కర్ఫ్యూ విధిస్తామన్నారు. మరో వారం రోజుల పాటు వేచి చూస్తామని, అప్పటికీ పరిస్థితిలో మార్పు రాకుంటే కర్ఫ్యూ లేదా లాక్ డౌన్ విధిస్తామన్నారు. వైరస్ నియంత్రణ కోసం ప్రజలందరూ విధిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లు, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు లక్ష కరోనా పరీక్షలు చేస్తున్నట్లు సీఎం యడియూరప్ప వెల్లడించారు.