Monday, November 18, 2024

ఆ లెక్కలు రైట్​​ అయితే​ రాజీనామా చేస్తా.. లేదంటే అమిత్​షా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలే: కేటీఆర్‌

తెలంగాణ కేంద్రానికి ఇచ్చింది ఎంత‌.. కేంద్రం తిరిగి తెలంగాణ‌కు ఇచ్చింది ఎంత‌? కేంద్రంలోని పెద్ద‌లు త‌ప్పుడు లెక్క‌లు, త‌ప్పుడు మాట‌లు మాట్లాడుతున్నరు. తెలంగాణ నుంచి ఇచ్చిందానికి.. తిరిగి కేంద్రం తెలంగాణకు ఇచ్చిందానికి పొంత‌నే లేదు. ఇగ అమిత్‌షా అయితే గొప్ప గొప్ప మాట‌లు చెప్తుండు.. తెలంగాణ‌కు అంతిచ్చినం, ఇంతిచ్చినం అంటుండు.. అదే నిజ‌మైతే నేను మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తా.. లేదంటే అమిత్‌షా అయినా ముక్కు నేల‌కు రాసి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలే..

– పాల‌మూరు స‌భ‌లో మంత్రి కేటీఆర్‌

మహబూబ్ నగర్ జిల్లా: మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో ఇవ్వాల (శ‌నివారం) మంత్రి కేటీఆర్‌తో పాటు ప‌లువురు మంత్రులు ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా భూత్‌పూర్ మున్సిపాలిటీ అమిస్తాపూర్‌లో బ‌హిరంగ స‌భ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లాలో కొత్తగా 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్​కు దక్కుతుందని మంత్రి కేటీఆర్​ అన్నారు. అయితే.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పాలమూరు జిల్లా సస్యశ్యామలం అవుతుందని, కానీ, ప్రధాని ఇదే ప్లేస్ లో మీటింగ్ పెట్టి పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇస్తామని చెప్పి మాటతప్పారని మంత్రి కేటీఆర్​ విమర్శించారు. “ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఒక్క పైసా నిధులు కేటాయించలేదు. అదే కర్నాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కు మాత్రం జాతీయ హోదా ఇచ్చారు. కేంద్రానికి తెలంగాణ మీద ప్రేమ లేదు.. కృష్ణ నీళ్లలో 811 టీఎంసీ లు ఉమ్మడి రాష్ట్రంలో వాటా ఉండే. ఎనిమిది ఏండ్ల నుండి అడగుతున్నప్పటికీ కేంద్రం ఉలుకు పలుకు లేకుండా ఉంటోంది. రైల్వే ప్రాజెక్ట్ లు ఇవ్వరు, జాతీయ హోదా ఇవ్వరు అని మంత్రి కేటీఆర్​ విమర్శలు గుప్పించారు.

ఇక.. ఎనిమిది ఏండ్లలో కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచి 3,68,797 కోట్ల రూపాయలు ఇచ్చామని, కానీ, 1,68,000కోట్ల రూపాయలు మాత్రమే తెలంగాణకు కేంద్రం నుంచి వాపస్ ఇచ్చారని వివరించారు మంత్రి కేటీఆర్​. మనమే ఈ భారతదేశానికి, వెనకబడ్డ రాష్ట్రాలకు 2 లక్షల కోట్లు ఇచ్చామన్నారు. తాను చెప్పేది తప్పు అయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్​ చేశారు కేటీఆర్​.. లేదంటే అమిత్ షా తప్పుడు లెక్కలు చెప్పినట్టు ఒప్పుకుని ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సవాల్​ విసిరారు.

ఇంకా కేటీఆర్​ ఏమన్నారంటే..
‘‘119 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నాం..దేవరకద్రలో 21 చెక్ డ్యామ్ లు కట్టి చూపించిన నాయకుడు ఆల వెంకటేశ్వర్ రెడ్డి.. సిరిసిల్ల నియోజకవర్గంలో 12 మాత్రమే ఉన్నాయి.. చెక్ డ్యామ్ లు ఒకదానికొకటి షేక్ హ్యాండ్ ఇచుకున్నట్టే ఉన్నాయి.. దేవరకద్ర నియోజకవర్గ కేంద్రం మున్సిపాలిటీ గా మారుస్తాం.. ఇండ్లు కట్టి, మంచినీళ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్​దే.. ఇంటింటికి నీళ్లు ఇచ్చి అడబిడ్డల కష్టం తీర్చిన ఘనత దేశంలో సీఎం కేసీఆర్ కే దక్కుతుంది. 30% నుండి 52% ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెరిగాయి. పల్లెటూర్లకు కూడా అపార్ట్ మెంట్ లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుంది” అన్నారు.

కాగా ఇవ్వాల పాలమూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. వీరితోపాటు ఎమ్మెల్యే లు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, అబ్రహం, గువ్వల బాలరాజు, అంజయ్య యాదవ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ లు వాణి దేవి, కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ లు వెంకటేశ్వర్ రెడ్డి, ఇంతియాజ్, వాల్యా నాయక్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement