తిరుపతి ఉప ఎన్నిక రాజకీయ వేడి పెంచుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తొలుత వైసిపి, టిడిపి మధ్య పోటీ ఉంటుందని భావించారు. అయితే కాంగ్రెస్, బీజేపీలు సైతం రంగంలోకి దిగాయి. దీంతో ఈ ఎన్నిక రసవత్తరంగా మారింది. మున్సిపల్ , పంచాయితీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపని బిజెపి.. తిరుపతి ఉప ఎన్నిక లో మాత్రం తమదే విజయం అన్న ధీమాలో ఉంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్న ప్రభను బరిలో దించారు.
వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మృతితో తిరుపతి లోక్ సభ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. తిరుపతి లోకసభ స్థానానికి ఉప ఎన్నిక ఏప్రిల్ 17 న జరగనుంది. ఈ ఉప ఎన్నికలో జనసేన పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోందని తొలుత ప్రచారం జరిగినప్పటికీ చివరికి బీజేపీ యే బరిలోకి దిగుతోంది. తెలంగాణలో బీజేపీ దుబ్బాక , జీహెచ్ఎంసీ విజయాలను దృష్టిలో ఉంచుకుని తిరుపతిలో కూడా గెలవాలని భావిస్తోంది. ఈ సందర్భంగా ఒక సారి గత ఎన్నికల ఫలితాలను చూద్దాం.
2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బొమ్మి శ్రీహరిరావు కి 16,125 ఓట్లు వచ్చాయి. అలాగే జనసేన మిత్రపక్షం బీఎస్పీ అభ్యర్థి దగ్గుమాటి శ్రీహరిరావు కి 20,847 ఓట్లు వచ్చాయి. వీళ్ళిద్దరికంటే ఎక్కువగా నోటా కు 25750 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ కి 24 వేల ఓట్లు వచ్చాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు. దుర్గాప్రసాద్ కి 7,22,877 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 4,94,501 ఓట్లు పడ్డాయి . దుర్గాప్రసాద్ 2,28,376 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అంతకుముందు 1999 లో ఇదే నియోజక వర్గం నుంచి టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థిగా వెంకటస్వామి గెలుపొందారు. 2004 లో బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్థిగా మళ్ళీ వెంకట స్వామి బరిలోకి దిగారు. బీజేపీకి 3,11,633 ఓట్లు వచ్చాయి. 1,01,328 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ గెలిచారు. 2009 లో కూడా మళ్ళీ వెంకట స్వామి పోటీ చేశారు. ఈ సారి పొత్తు లేదు. దాంతో ఆయన ఓటమిపాలయ్యారు. 2014 కొచ్చేసరికి మళ్ళీ టీడీపీ బీజేపీల మధ్య పొత్తు కుదిరింది. కారుమంచి జయరాం బీజేపీ తరపున పోటీ చేశారు ఆయనకు 542,951 ఓట్లు వచ్చాయి. 37,425 ఓట్ల మెజారిటీ తో వైసీపీ అభ్యర్థి వరప్రసాద్ గెలుపొందారు. మోడీ వేవ్ లోను పార్టీ అక్కడ పట్టు బిగించలేకపోయింది.
బీజేపీ టీడీపీ పొత్తు ఉన్నపుడే ఇక్కడ బీజేపీ గెలుస్తున్నది.అది కూడా రెండుసార్లు మాత్రమే గెలిచింది. ఇక ప్రస్తుతం జరగబోతున్న ఉప ఎన్నికలో కూడా టీడీపీ , బీజేపీ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఇక్కడ బీజేపీకి ఉన్న బలాన్ని బట్టి చూస్తే ఏదైనా అద్భుతం జరగాలి. అపుడే ఆ పార్టీ విజయం సాధిస్తుంది. ఒంటరి పోరాటం అంత సులభం కాదని విశ్లేషకులు అంటున్నారు. అయినప్పటికీ బీజేపీ నేతలు గట్టి ప్రయత్నాలు చేసే యోచనలో ఉన్నారు. పార్టీకి ఒక ఊపు తెచ్చే లక్ష్యంతో దూసుకుపోవాలని వ్యూహ రచన చేస్తున్నారు. ఐఏఎస్ అధికారిణి రత్నప్రభను రంగంలోకి దించారు. గత ఎన్నికలో ఓడిపోయిన తెలుగు దేశం పార్టీ తన అభ్యర్థిగా మళ్ళీ పనబాక లక్ష్మి నే బరిలోకి దించింది. పనబాక ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. ఇక వైసీపీ తరపున దుర్గాప్రసాద్ కుమారుడు కళ్యాణ్ కి కాకుండా ఫిజియో థెరపిస్ట్ గురుమూర్తికి టిక్కెట్ ఇచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇంఛార్జిగా పెట్టారు. పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైసీపీ ఈ ఉప ఎన్నిక లోను స్వీప్ చేయాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు. ఆయనకు గత ఎన్నికల్లో 24,039 ఓట్లు వచ్చాయి. 2014 లో 33,333 ఓట్లు వచ్చాయి. అప్పటి మెజారిటీ తగ్గి పోయింది. కాంగ్రెస్ తరపున ఈ సారి కూడా చింతా మోహన్ పోటీలో ఉన్నారు.
ఇక దుబ్బాక ఉప ఎన్నికకు, తిరుపతి ఎంపీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు పోలిక… పొంతన లేదు. ఏపీ పరిస్థితులు వేరు. తెలంగాణ పరిస్థితులు వేరు. ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్యే తీవ్ర పోటీ ఉంది. ఈ రెండు పార్టీలను దాటుకుని బీజేపీ ముందుకు వెళ్లడం ఆ పార్టీకి సాధ్యమయ్యే పనికాదు. మరి తిరుపతిలో బీజేపీ ఏదైనా అద్భుతాన్ని సృష్టిస్తుందేమో చూడాలి.