Tuesday, November 12, 2024

Big Story: సర్దుకుంటారా, సైడ్​ అవుతారా:  టీ కాంగ్రెస్​లో పంజాబ్​ ఎఫెక్ట్​ ఉంటుందా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ పార్టీ దేశ వ్యాప్తంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇబ్బందులను పడుతున్నంది. ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాల్లోనే అధికారంలోకి కొనసాగుతున్నది. నిన్నమొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో హస్తం పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలకు గాను.. పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. అధికారాన్ని చే జార్చుకున్నది. అయితే ఆ రాష్ట్రంలో అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు, సమన్వయ లోపం కారణమనేది స్పష్టమవుతోంది. ఇదే పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్నది. టీ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత అది మరింత ఎక్కువైంది. టీ పీసీసీ కమిటిలోని ముఖ్య నాయకుల మధ్యనే పొసగడం లేదు. నిత్యం ఉప్పు, నిప్పుగా ఉంటున్నారు. పాత, కొత్త పంచాయతీ నాయకుల మధ్య ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో టీఆర్‌ఎస్‌ ప్రత్యామ్నాయంగా తామే ఉంటామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నప్పటికి బీజేపీ ఒక ఫోర్స్‌గానే ముందుకొస్తుందని హస్తం నేతలు ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణ ఇచ్చిన పార్టీ చెబుకుంటున్న నాయకులు.. ఇప్పటికే రెండు పర్యాయాలు హస్తం పార్టీ అధికారానికి దూరమైంది. అయినప్పటికి నాయకుల తీరు మాత్రం మారడం లేదని కాంగ్రెస్‌ కేడర్‌ అందోళన వ్యక్తం చేస్తున్నది. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్ట పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రజా సమస్యలపై కార్యక్రమాలు తీసుకుని ఆందోళనలు చేపడుతున్నారు. దళిత, గిరిజన దండోరా, నిరుద్యోగ సమస్యలు, రైతు సమస్యలతో పాటు ఇప్పుడు మన ఊరు- మన పోరు కార్యక్రమానికి తీసుకుని జిల్లాల వారిగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికి పార్టీ సీనియర్లను రేవంత్‌రెడ్డి కలుపుకుని పోవడం లేదనే విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. కొన్ని అంశాలు, నిర్ణయాలు పార్టీలో చర్చించకుండానే సొంతగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు సీనియర్లు బహటంగానే అసంతృప్తులను వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఆ జిల్లాకు చెందిన సీనియర్లు సమాచారం ఇవ్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు చేయడమే కాకుండా పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత పలువురు సీనియర్లు రంగంలోకి దిగి బుజ్జగింపులు చేపట్టి తాత్కాలికంగా చల్లబర్చారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గాంధీభవన్‌ మెట్లు ఎక్కడం లేదు. పార్టీ ముఖ్యమైన సమావేశాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. అదే బాటలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా ఉన్నారు. ఇకపోతే జిల్లాల వారిగా కూడా నాయకుల మధ్య సఖ్యత కొరవడటమే కాకుండా వర్గపోరు నడుస్తోంది. ఎన్నికలకు ఏడాదిన్న సమయం మాత్రమే మిగిలి ఉన్నది. ఇలాంటి సమయంలో రాష్ట్రం, జిల్లాలతో పాటు నియోజక వర్గ స్థాయిలో ఉన్న నాయకుల మధ్య నెలకొన్న పంచాయతీలను పరిష్కరించుకుని ముందుకు సాగితేని మంచి ఫలితం ఉంటుందని లేదంటే పంజాబ్‌ లాగ మరోసారి రాష్ట్రంలో చేదు పలితం చవి చూడాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement