సాధారణంగా భర్త కొట్టాడని భార్య రోడ్డెక్కుతుంది. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. తన భార్య తనని కొడుతోందని..కంట్లో కారం వేసి మరీ హింసిస్తోందని ఓ భర్త పోలీసులకి ఫిర్యాదు చేయడం విశేషం. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో చోటు చేసుకుంది. తన భార్య నుంచి కాపాడాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. అత్తింటి వారితో వేగలేక పోతున్నానని.. దయచేసి తనకు న్యాయం చేయాలని కోరాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని మొరెనా జిల్లా రితోరా సమీపంలోని ఓ గ్రామానికి చెందిన సంజయ్ సింగ్ కు గ్వాలియర్ లోని మహల్ గావు ప్రాంతానికి చెందిన పూజతో రెండేళ్ల క్రితం వివాహమైంది. సంజయ్ మలాన్ పూర్ లోని ఓ ఫ్యాక్టరీలో ప్లంబర్ గా పని చేసేవాడు. పెళ్లయిన కొన్నిరోజుల వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. వీరిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఆ తర్వాత క్రమంగా విభేదాలు తలెత్తాయి. అత్తింటి వారిని పూజ అసలు గౌరవించేది కాదట.. ఇంట్లో పనులు కూడా చేసేది కాదట.. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేదట.
ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం సంజయ్ ఉద్యోగం కోల్పోయాడు. ఆ తరువాతే గొడవలు మరింత పెరిగాయి.ఈ క్రమంలో సంజయ్ తల్లిదండ్రులను పూజా తిట్టింది. మీ పేరెంట్స్ మంచివారు కాదు అనడంతో సంజయ్ కి కోపం వచ్చింది. భార్యను చెంపదెబ్బ కొట్టాడు. నీ వల్ల ఇంట్లో మనశ్శాంతి లేదని తిట్టాడు. ఆ తర్వాత పూజను గ్వాలియర్ లోని తన పుట్టింట్లో దింపడానికి వెళ్ళాడు. సంజయ్ తన అత్తింటికి వెళ్ళాక గొడవ మరింత పెద్దదయింది. తన తల్లిదండ్రులు, సోదరులతో కలిసి సంజయ్ పై దాడి చేసింది పూజ. సంజయ్ ను ఇటుకలతో కొట్టడమే కాకుండా.. కంట్లో కారం చల్లారు. అందరూ కలిసి సంజయ్ ను చితకబాదారు. దాంతో పోలీసులను ఆశ్రయించాడు సంజయ్. ఈ ఘటన తర్వాత అతను నేరుగా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు ..ఆ తర్వాత ఎస్పీ కార్యాలయానికి వెళ్లి తన గోడును వెళ్లబోసుకున్నాడు. తన భార్య కంట్లో కారం పోసి కొట్టింది అని.. ఆమె నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశాడు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పూజతో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరులను విచారిస్తున్నారు. ఒకవేళ వారు తప్పు చేశారని తేలితే… కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్పి వెల్లడించారు.