కర్నుల్ జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ప్రకటించారు సీఎం జగన్. అయితే, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఈ ప్రశ్నపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
తొలి స్వాతంత్ర్య సమరయోధుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గుర్తింపు పొందారు. ఆయన జీవిత కథతో ఇప్పటికే చిరంజీవి సైరా సినిమా చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడకు పాలెగాడిగా వ్యవహరించిన నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగానే సైరా నరసింహారెడ్డి సినిమా రూపొందించారు. సుదీర్ఘకాలం పాటు సాగిన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో 1857 సిపాయిల తిరుగుబాటుకి ప్రత్యేక స్థానం ఉంది. అంతకు దశాబ్దకాలం ముందే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తొలి స్వాతంత్ర్య పోరాట యోధుడిగా గుర్తింపు పొందారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర 170 ఏళ్ల కిందటిది. 1847లోనే ఆయన చనిపోయినట్లు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. నరసింహారెడ్డి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా పాలనను ఎదిరించారు. 1846లో బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు ప్రారంభించి సుమారు ఏడాది కాలంపాటు పోరాడారు. ఆ ఉద్యమానికి అనేక మంది తోడ్పడ్డారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా సాగించిన ఈ తిరుగుబాటులో సుమారుగా 5 వేల మంది అనుచరులు ఆయనకు అండగా నిలిచినట్టు పరిశోధకులు చెబుతున్నారు. చివరికి 1847లో బ్రిటిష్‌వారు నరసింహారెడ్డిని బంధించి ఉరి తీసి, ఆయన శవాన్ని కోట గుమ్మానికి వేలాడ దీశారు. అయితే, సీమ వీరుడిగా ఉయ్యాలవాడ గుర్తింపు పొందారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సాగించిన పోరాటానికి గుర్తుగా.. ఆయనను గౌరవిస్తూ, నివాళులర్పిస్తూ కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ఏపీ ప్రభుత్వం పెట్టినట్లు తెలుస్తోంది.