ఇప్పటికే ఆలస్యం అయిన నైరుతి రుతుపవనాల రాక మరింత లేట్ కానుందా? వాతావరణంలో ఇంత విపరీత పరిణామాలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై వాతావరణ నిపుణులు ఏం చెబుతున్నారు? అనే అంశాలను పరిశీలిస్తే వెదర్‌కు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తున్నాయి. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలను ముందుకు పుష్ చేయగలిగే వాతావరణం ఏర్పడకపోవడమే దీనికి కారణం అంటున్నారు వెదర్ అనలిస్టులు.
– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
జూన్ మొదటి వారంలో రావాల్సిన నైరుతి రుతుపవనాలు వాతావరణంలో మార్పుల వల్ల ఆలస్యం అవుతున్నట్టు ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెంట్ అంచనా వేస్తోంది. దీనికి బంగాళాఖాతంలో అల్ప పీఢనాలు కానీ, వాయుగుండాలు కానీ ఏర్పడకపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు అనలిస్టులు. దీంతో నైరుతి ప్రయాణం సాఫీగా సాగడం లేదని, మందగమనంలో ఉందని, అందుకే ముందుకు కదలడంలో ఆలస్యం అవుతున్నట్టు అంచనా వేస్తున్నారు. అయితే జూన్ 12వ తేదీ నుంచి ఏపీలోని తిరుపతిలో తొలకరి జల్లులు కురిశాయి. రైతులతో పాటు సాధారణ ప్రజలంతా నైరుతి వచ్చిందని, వానలకు ఢోకా ఉండదని సంబురపడ్డారు. కానీ, దీని పురోగతిపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఇప్పుడు అందరిలో ఆందోళన నెలకొంది.
కాగా, బంగాళాఖాతంలోని వాతావరణ పరిస్థితులు రుతుపవనాలకు ప్రధాన డ్రైవర్లుగా మారుతాయి. అటువంటి వ్యవస్థ బంగాళాఖాతంలో త్వరలో ఉద్భవించే అవకాశమే లేదని స్కైమెట్ ఏజెన్సీ తన నివేదికలో పేర్కొంది. స్కైమెట్ ఎక్స్‌టెండెడ్ రేంజ్ ప్రిడిక్షన్ సిస్టమ్ (ERPS) జూన్ 09, జులై 06వ తేదీల మధ్య దుర్భరమైన వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తోంది. అంతేకాకుండా.. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కోర్ మాన్‌సూన్ జోన్‌లకు తప్పనిసరిగా నైరుతి రుతుపవనాల వర్షాలు అవసరమని స్కైమెట్ తన నివేదికలో పేర్కొంది.
వాతావరణ పరిస్థితులను స్కైమెట్ అనలైజ్ చేసిన ప్రకారం.. తెలంగాణలో మరికొద్ది రోజులు తీవ్రమైన ఎండలు ఉండే చాన్స్ ఉన్నట్టు స్పష్టమవుతోంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండనుంది. ఇక.. వారం రోజులుగా అరేబియా సముద్రంలో తలెత్తిన తుపాను పరిస్థితులు మరింత తీవ్రం కానున్నాయి. బిపర్జాయ్ తుపాను నైరుతి రుతుపవనాలపై తీవ్రమైన ఎఫెక్ట్ చూపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో జూన్ 15వ తేదీ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు (40 డిగ్రీల సెల్సియస్‌కు) నమోదయ్యే అవకాశం ఉంటుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది.