సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలియజేయాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వం, పోలీసు శాఖ నుంచి వివరణ కోరింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన క్రిమినల్ కేసుల్లో సోషల్ మీడియా కంపెనీలను నిందితులుగా, ప్రేరేపకులుగా ఎందుకు చేర్చలేరనే దానిపై మధురై బెంచ్ ప్రశ్నించింది. యూట్యూబర్ సత్తై దురైమురుగన్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని తమిళనాడు పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సందర్భంగా జస్టిస్ బి పుగలేంధి కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీని దుర్వినియోగం చేయడానికి అనుమతి లేదని జస్టిస్ బి పుగలేంధి అన్నారు. యూట్యూబర్ దురైమురుగన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వీడియోలను ప్రసారం చేసి ఎంత సంపాదిస్తున్నారనే దానిపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని పోలీసులను కోరారు.
దురైమురుగన్ తరపు న్యాయవాదిని దీనికి సంబంధించిన వివరణ ఇస్తున్నప్పుడు డబ్బు సంపాదించడానికి చాలా మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను దుర్వినియోగం చేస్తున్నారని న్యాయమూర్తి మౌఖికంగా గమనించారు. కొంతమంది యూట్యూబ్‌లోని వీడియోల ద్వారా తుపాకీలను తయారు చేయడం, దోచుకోవడం వంటి నేరాలు చేయడం నేర్చుకున్నామని కూడా అంగీకరించారు. అయితే యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఇలాంటి కేసుల్లో నిందితులుగా ఎందుకు చేర్చలేరని జడ్జి ప్రశ్నించారు. యూట్యూబ్ దుర్వినియోగాన్ని నిరోధించేందుకు అనుసరించాల్సిన యంత్రాంగంపై వివరణాత్మక నివేదికను వారంలోగా సమర్పించాలని తమిళనాడు ఏడీజీపీ – సైబర్ క్రైమ్ బ్రాంచ్‌ను న్యాయమూర్తి ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..