Tuesday, November 26, 2024

Spl Story: ‘సింహం’ ఎందుకు న‌వ్వాలే?!.. ఇప్పుడే ఈ కాంట్రవ‌ర్సీ ఎందుకొచ్చింది!

భారత దేశ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేసేలా దేశ రాజధాని ఢిల్లీలో నూతన పార్లమెంట్​ భవన్​ నిర్మాణం జరుగుతోంది. అయితే.. అక్కడ నిర్మించిన అశోక చక్రం స్తూపంపై ఉన్న సింహాల రూపం పూర్తిగా మారిపోయిందని, ఆ సింహాలు కోరలు చాచి, గర్జిస్తున్నట్టు ఉన్నాయన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అసలు అశోక చక్రంపై సింహాలు ఎట్లుండాలే.. ఎందుకు భీకరంగా ఉండకూడదు.. ఎందుకు నవ్వినట్టు ఉండకూడదు.. మన సింహాలు నవ్వొద్దా, గర్జించొద్దా అనే అనుమానాలు, సందేహాలు చాలామందిలో కలుగుతున్నాయి. పలు సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే ఓ మీడియా మిత్రుడు రాసిన ఈ ముచ్చట‌ చదివి తెలుసుకోవాల్సిందే..

‌– డిజిట‌ల్ మీడియా విభాగం, ఆంధ్ర‌ప్ర‌భ‌

‘‘నిజమే.. క్రూర జంతువైన సింహం గర్జిస్తూ ఉండాలే కానీ, శాంతంగా ఎందుకుండాలే? అనే ఆలోచన కొంతమందికి రావచ్చు. అటువంటి ఆలోచనే, డెభ్భై ఏండ్ల తర్వాత భారత ప్రధానికీ, కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించే పెద్దలకు వచ్చినట్టుంది. ఇందులో ఆశ్యర్యం ఏమీ లేదు. ఈ అనుమానం వారికే కాదు. ఎవరికైనా రావడం సహజమే. ఎందుకంటే.. సింహాన్ని క్రూరత్వానికి చిహ్నంగా, తాను బలవంతున్ని కాబట్టి.. తనకిక ఎదురు లేదు, ఇక మందిమీద ఇర్సుకపడడమే, అదును చూసి దెబ్బకొట్టడమే., సాధు జంతువులను పీక్కతినడమే మన పని.. అనే మానసిక స్థితి నుంచి చూసే వారికి అనిపించవచ్చు. ఇట్లానే ప్రధాని మోడీకి కూడా అనిపించి ఉండవచ్చు. గమ్మునెందుకుండాలే.. ‘గర్జించాల’నిపించడంలో తప్పులేదు.

కానీ, అదే సింహాన్ని నాడు తనకు ఎదురేలేదని యుద్ధంలోకి దిగి సర్వం కోల్పోయి, తన గర్వభంగమైనంక.. మారిన మనసుతో.. బుద్ధుని శాంతి సౌభ్రాతృత్వ తాత్వకతను ఆచరించిన సామ్రాట్ అశోక మహా చక్రవర్తి దృష్టి కోణంలోంచి చూస్తే.. సింహాన్ని అధికార దర్పానికి చిహ్నంగానే కాకుండా.. శాంతికి, శక్తికి, ధైర్యానికి, విశ్వాసానికి ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించే పరిస్థితి ఉంటుంది. తనకు అన్ని రకాల అధికారాలున్నా వాటిని దుర్వినియోగం చేయకుండా ఉండే బాధ్యత కలిగిన ఓ పెద్దమనిషిగా సింహం కనిపిస్తది.

అట్లా ఉండవలసిన అక్కెరున్నదని భావించినప్పుడు.. స్థిత ప్రజ్జతతో కూడిన ప్రశాంత స్థితిలో.. స్థిరత్వం కలిగిన ఒక ప్రజా రంజక పాలకునిగా ఆలోచించినప్పుడు.. శాంతంగా (జంతువులు నవ్వలేవు కావట్టి.. లేకుంటే దర్పంతో కూడిన చిరునవ్వుతో) కూర్చున్న సింహాలే కరెక్టనిపిస్తయి. ఎందుకంటే.. ఈ దేశంలో ప్రజాస్వామ్యం పదికాలాల పాటు ఫరిఢవిల్లాలని కోరుకునే వారందరికీ ఇట్లా ఉండడమే రైట్​ అనిపిస్తుంది’’..

Advertisement

తాజా వార్తలు

Advertisement