Tuesday, November 26, 2024

ఖమ్మంపై షర్మిల చూపు.. ఎవరికి ముప్పు?

రాజన్న రాజ్యమే లక్ష్యంగా త్వరలోనే తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నట్లుగా గతంలో ప్రకటించిన వైయస్ షర్మిల.. ప్రస్తుతం పార్టీకి సంబంధించిన విధివిధానాలను రెడీ చేస్తున్నారు. ఖమ్మం వేదికగా ఏప్రిల్ 9న లక్షమందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీని, పార్టీ ఎజెండాను ప్రకటించనున్నారు. అయితే దీనికంటే ముందే కీలకమైన విషయాన్నీ బయటపెట్టారు షర్మిల.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి తానూ పోటీ చేస్తానని తెలిపారు. వైఎస్ఆర్‌కు పులివెందుల ఎలాగో.. తనకు పాలేరు అలాగని అన్నారు. అయితే షర్మిల ఎక్కువగా ఖమ్మం పైన ఎందుకు ఫోకస్ చేశారు. తెలంగాణలో ఇన్నీ జిల్లాలుండగా ఖమ్మం పైన షర్మిల ప్రత్యేకమైన దృష్టి ఎందుకు పెడుతున్నారన్నది అందరిలో ఉత్పన్నమవుతున్న ప్రశ్న.

ఖమ్మం ముందునుంచి కాంగ్రెస్ కి మంచి పట్టున్న జిల్లా. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచింది. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ.. 2014ఎన్నికల్లో పోటీ చేయగా అక్కడ ఒక ఎంపీ సీటుతో పాటు మూడు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత గెలిచినా వాళ్ళంతా టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. వైసీపీకి మంచి పట్టున్న జిల్లాగా పేరున్న ఖమ్మంను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోవద్దని షర్మిల భావిస్తున్నారు. అందుకే తన పార్టీ ప్రభావాన్ని ఎక్కువగా ఖమ్మం జిల్లాపై ఉండేలా చూసుకుంటున్నారు. దీనికి తోడు ఖమ్మం జిల్లా ఆంధ్ర సరిహద్దు కావడంతో వైసీపీ ప్రభావం తన పార్టీపై ఉండేలా షర్మిల చూసుకుంటున్నారు. అందులో భాగంగానే తొలుత ఖమ్మం జిల్లా నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రస్తుతం అన్ని పార్టీల నేతలు షర్మిల వైపు చూస్తున్నారు.

ఇదిలావుండగా షర్మిల ఖమ్మం పైన ఇంతా ఫోకస్ చేస్తే నష్టపోయేది ఏ పార్టీ అనే చర్చ కూడా పోలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే షర్మిల పార్టీ వల్ల అధికంగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ నే అని చర్చ నడుస్తోంది. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా సత్తా చాటిన టీఆర్ఎస్.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం గట్టి పోటీని ఇవ్వలేకపోయింది. ఇక్కడ కాంగ్రెస్ దే పై చేయిగా నడిచింది. కాంగ్రెస్ తరవాత టీడీపీ పైన ఈ ఎఫర్ట్ పడే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో బలం పెంచుకుంటున్న బీజేపీకి షర్మిల పార్టీ పెద్ద సవాలే అని చెప్పాలి. ఇక టీఆర్ఎస్ అయితే షర్మిలకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా పార్టీ పెట్టబోతున్నట్లు షర్మిల ప్రకటించారు. అంతేకాదు ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో టిఆర్ఎస్ నేతలు షర్మిలపై ఫైర్ అయ్యారు. తెలంగాణలో రాజన్న రాజ్యం అవసరం లేదంటూ పలువురు నేతలు బహిరంగంగా వ్యాఖ్యానించారు. తెలంగాణకు కెసిఆర్ పాలనే శ్రీరామ రక్ష అంటూ చెబుతున్నారు. మరోవైపు షర్మిల పార్టీతో తమకు ఏమీ నష్టం లేదంటూ సీఎల్పీ నేత భట్టి అంటున్నారు. షర్మిల పార్టీతో టిఆర్ఎస్ కె నష్టమంటూ పేర్కొన్నారు. మొత్తం మీద షర్మిల పార్టీపై ఇతర పార్టీల నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షర్మిల పార్టీలో వలసలు ఉంటాయా? లేదా? అన్నది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement