పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు అజ్ఞాతంలో ఎందుకు వెళ్లారు. గత పది రోజులుగా ఎక్కడ ఉన్నారు ? ఏం చేశారు? పుట్టా మధు పారిపోవడానికి గల కారణం ఏంటి ? అనేవి చర్చనీయాంశమైయ్యాయి. అయితే, పోలీసులు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీలోని భీమవరంలో పుట్టా మధును తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం ఇక్కడికి తీసుకువచ్చి విచారించారు. ఇందులో భాగంగా తాను ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారో, ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చిందో పుట్టా మధు వివరించారు.
దాదాపు మూడు నెలల క్రితం జరిగిన హైకోర్టు లాయర్ గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో పోలీసులు చార్జిషీటు వేయడానికి సిద్ధపడుతున్న సమయంలో హత్యకు సంబంధించి అప్పటికే సాక్షులను విచారించారు. ఛార్జ్ షీట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్న వేళ.. ఆ సమయంలో వామన రావు తండ్రి రామగుండం సీపీ సత్యనారాయణకు ఇచ్చిన ఫిర్యాదు సంచలనం రేకెత్తించింది. దీంతో పుట్టా మధును విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. గతంలో ఒకసారి పుట్టా మధును పోలీసులు విచారించారు. కొత్తగా చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే పుట్టమధు విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఆదేశించారు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం పోలీస్ గెస్ట్ హౌస్ కు డ్రైవర్, ఇద్దరు గన్ మెన్ లతో కలిసి విచారణకు పుట్టా మధు వచ్చారు. మూడు జీపుల్లో పోలీస్ అధికారులు గెస్ట్ హౌస్‌కి వస్తున్నారంటూ అప్పటికే అతనికి సమాచారం రావడంతో భయపడిపోయిన పుట్టా మధు వెంటనే గెస్ట్ హౌస్ నుంచి బయటికొచ్చి.. గన్ మెన్ లతో పాటు డ్రైవర్ కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మహారాష్ట్రకు వెళ్ళిపోయాడు. అక్కడ రెండు రోజులు ఉన్నారు. అక్కడి నుంచి ఛత్తీస్ గఢ్ కు వెళ్లారు. ఆ తర్వాత ఒడిశా.. అక్కడి నుంచి కారులో భీమవరం చేరుకున్నారు. భీమవరంలోని ఓ రిసార్ట్స్‌లో ఉన్నారు.
అయితే, పుట్టా మధు మిస్సింగ్ వ్యవహరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఈటలకు సన్నిహితుడు కావడంతో ఆయనపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పుట్టా మధు 10 రోజుల నుంచి కనిపించడం లేదంటూ వార్తలు హల్ చల్ చేశాయి. పుట్టా మధు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పట్టుకున్నారు. మధు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఆయన ఎక్కడ ఉన్నారన్న అంశం మిస్టరీగా మారింది. అయితే, పోలీసులు ఆయన జాడ గుర్తించారు. ప్రస్తుతం రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు.
ఇది కూడా చదవండి: తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదు…ఏపీ సర్కార్