కరోనా కొత్త వేరియెంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో ఒమిక్రాన్ పంజా విసురుతుండగా.. తాజాగా భారత్‌లోకి ప్రవేశించింది. కర్నాటకలోనే ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ నిన్న వెల్లడించారు. వైరస్ సోకిన వారిలో ఒకరు విదేశీయుడు కాగా.. మరొకరు బెంగళూరుకు చెందిన డాక్టర్ ఉన్నారు. అయితే ఒమిక్రాన్ సోకిన ఈ డాక్టర్‌కు ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడమే ఇక్కడ గమనార్హం. ఇక ఆయనతో కాంటాక్ట్ అయిన వారిలో ఐదుగురికి పాజిటివ్ అని తేలడంతో చాలామంది ఆందోళనకు గురవుతున్నారు.
బొమ్మనహళ్లి నివాసి అయిన 46 ఏళ్ల డాక్టర్ బన్నేరుఘట్ట రోడ్‌లోని ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ఆ డాక్టర్‌కు నవంబర్ 22న పాజిటివ్ అని తెలిసింది. జలుబు, ఒళ్లు నొప్పులు ఉండడంతో డౌటుతో కరోనా టెస్ట్ చేసుకున్నాడు. పరీక్షలో పాజిటివ్ అని తేలింది. పలు అనుమానాల నేపథ్యంలో జెనోమిక్ సీక్వెన్సింగ్ కోసం అతడి నమూనాలను పంపించగా.. గురువారం అతడికి ఒమిక్రాన్ అని తేలింది. అయితే రెండు డోసులు తీసుకోవడంతో ఆ డాక్టర్‌కు తీవ్రమైన లక్షణాలు లేవు. ప్రస్తుతం అతడు ఐసొలేషన్‌లో ఉన్నారు.
ఆ డాక్టర్ 13 మందితో పర్సనల్‌గా.. 205 మందితీ సెకండరీ కాంటాక్ట్ అయినట్టు తెలిసింది. వీరందరికీ టెస్ట్ చేయగా.. రెండు ప్రైమరీ కాంటాక్ట్‌లు, ఒక సెకండరీ కాంటాక్ట్ గా ఉన్న వారికి పాజిటివ్ అని తేలింది. వారి నమూనాలను కూడా జెనోమిక్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. డాక్టర్ భార్య, 13 ఏళ్ల కుమార్తెకు కూడా పాజిటివ్ తేలగా.. 6 ఏళ్ల కుమారుడికి మాత్రం నెగిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. ముందస్తు చర్యలో భాగంగా బాలుడికి మరోసారి టెస్ట్ చేయనున్నారు.
ఆ డాక్టర్ సహోద్యోగికి పాజిటివ్ అని తేలింది. అతని భార్య, అత్తయ్యతో సహా ద్వితీయ పరిచయాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. డాక్టర్‌తో పరిచయం ఉన్న ఆరుగురు రోగులను పరీక్షించగా నెగెటివ్‌గా తేలింది. ఇక డాక్టర్ పనిచేసిన ఆపరేషన్ థియేటర్లను శానిటైజ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..