విజయనగరం మహారాజా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కరోనా బాధితులు మృతిచెందడం, విశాఖలో ఆస్పత్రుల్లో పడకల కొరత గురించి వింటుంటే మనసు కకావికలమవుతోందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఆస్పత్రికి వస్తే అక్కడ ప్రాణవాయువు లేకపోవడం దురదృష్టకరమన్నారు. అత్యవసర ఔషధమైన రెమిడెసివిర్‌ను బ్లాక్ మార్కెట్లో రూ. లక్షలకు అమ్ముతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఒక్కో ఇంజక్షన్ ను రూ.40 వేలకు అమ్మతుంటే సామాన్యులు, పేదలు తమ ప్రాణాలను ఎలా కాపాడుకోగలరని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘ రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులకు ఆక్సిజన్ సక్రమంగా అందడం లేదు. విజయవాడలోని ఆస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉంది. వేలకొద్దీ అంబులెన్స్ లు ఏర్పాటు చేశామని చెబుతున్న ప్రభుత్వం.. వాటిలో రోగులను మాత్రం ఆస్పత్రులకు తరలించలేకపోతోంది. రెమిడెసివిర్ ఇంజక్షన్ల కోసం జిల్లాలవారీగా ప్రత్యేక అధికారులను కేటాయించామని ప్రకటించారు. కానీ, వారు సరిగా స్పందించడం లేదని ప్రజలు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆక్సిజన్ డిమాండ్, సరఫరా, వినియోగం పై అత్యవసర ఆడిట్ చేపట్టి ఆక్సిజన్ నిరంత రాయంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలి. బ్లాక్ మార్కెట్ ను అడ్డుకునే చర్యలు చేపట్టాలి’’ అని పవన్ అన్నారు.
ప్రతి నిమిషానికి 20 మంది ప్రాణాలు కోల్పోతున్నారని అధికారిక లెక్కలున్నా.. నిజానికి అంతకంటే ఎక్కువ మందే చనిపోతున్నారని క్షేత్రస్థాయి సమాచారం చెబుతోందని పవన్ అన్నారు. కరోనా మరణాల లెక్కలను ప్రభుత్వం దాచినప్పటికీ.. మృతుల కుటుంబీకుల కన్నీటికి అడ్డుకట్ట వేయగలదా?అని ప్రశ్నించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పది, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేయడం ద్వారా విద్యార్థులను, వారి కుటుంబాలను ముప్పు నుంచి కాపాడవచ్చని పవన్ అభిప్రాయపడ్డారు. కరోనా బాధితులకు నిరంతరం సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులు,ఇతర వైద్యసిబ్బంది సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పవన్ కల్యాణ్ కోరారు.