ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ ఎంపీలు ఈరోజు లోక్ సభలో గొడవ చేస్తుండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అడ్డుకున్నారు. వానా కాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనే దిక్కులేక వరి కుప్పలపై పడి రైతులు ప్రాణాలిడుస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. టీఆర్ఎస్ ఎంపీలకు ధీటుగా బండి సంజయ్ నినాదాలు చేస్తూ.. ఆ పార్టీ సభ్యుల తీరును ఎండగట్టారు. బండి సంజయ్ తోపాటు బీజేపీ ఎంపీ సోయం బాబూరావు సభలో లేచి నిలబడి టీఆర్ఎస్ ఎంపీల నినాదాలకు ప్రతి నినాదాలు చేశారు. ఎందుకీ డ్రామాలు? యాసంగి పంట కొనబోమని మీకెవరు చెప్పారు? రా రైస్ పక్కా కొంటాం. ఇదే మాట కేంద్రం చెబుతున్నా డ్రామాలెందుకు? వానా కాలం పంట ఎందుకు కొనడం లేదని అడుగుతుంటే యాసంగి పేరుతో ఈ డ్రామాలేంది? కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో ధాన్యం వానకు తడుస్తూ మొలకలెత్తున్నా.. ఎందుకు కొనడం లేదు. వరి కుప్పలపై రైతుల చస్తున్నా.. మీ కళ్లకు కనబడడం లేదా? ఇంకెంత మంది రైతులను చంపుతారు ? అని నిలదీశారు.
వానా కాలం పంటకు సంబంధించి ప్రతి గింజను కొంటామని కేంద్ర మంత్రి చెబుతున్నా.. రైతుల నుండి ఎందుకు సేకరించడం లేదు ? యాసంగిలోనూ రా రైస్ కొంటామని కేంద్రం ప్రకటించినా… ఇంకా ఈ రాజకీయం చేయడమేంది ? సమస్యను పక్కదారి పట్టించేందుకే టీఆర్ఎస్ ఎంపీలు ఈ డ్రామా చేస్తున్నారని విమర్శించారు. నిన్న(బుధవారం) టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లోని క్యాంటిన్ వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపిన ఫొటోలను పార్లమెంట్ లో నిరసన తెలుపుతున్నట్లుగా ఈరోజు మీడియాలో ఫొటోలు ప్రచురితం కావడం పట్ల బండి సంజయ్ విస్మయం వ్యక్తం చేశారు. సెంట్రల్ హాల్ క్యాంటిన్ లో ఫొటోలు దిగి పార్లమెంట్ లో నిరసన తెలిపినట్లు మీడియాకు ఫోజులివ్వడమా ? సిగ్గు సిగ్గు…అంటూ టీఆర్ఎస్ ఎంపీలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital