మోడీ అంటే చాలామంది ముఖ్యంత్రులకునచ్చట్లేదు. ఆయనతో ఎందుకు పడ్తలేదన్నది ఇప్పుడు అంతా ఆలోచిస్తున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ వెళ్లలే.. అంతకుముందు మహారాష్ట్రలో కూడా ఇట్లనే జరిగింది. మరి, మోడీతో సీఎంలకు ఎందుకు పడ్తలేదు.. రాజకీయ కారణాలా.. పాలనాపరమైన వైరుధ్యాలా?
దేశ ప్రధాని అంటే అందరికీ గౌరవం ఉంటుంది. యావత్ భారతాన్ని.. దేశ ప్రజలను కన్న బిడ్డల లెక్క చూసుకోవాల్సి ఉంటుంది కనుక ఆ గౌరవ భావం వ్యక్తం చేస్తారు. ఇప్పటిదాకా ఉన్న ప్రధానమంత్రులంతా ఇట్లానే వ్యవహరించారు. వారిపట్ల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఎంతో గౌరవం చూపేవారు.
ఇక్కడ సీన్ కట్ చేస్తే..
బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ తీరు కంప్లీట్‌గా మారిపోయింది. పేదలు అన్నా, వారి బాధలు అన్నా పట్టించుకోకపోవడం.. ధరల స్థిరీకరణకు కావాల్సిన చర్యలు తీసుకోకపోవడం.. పైగా రాష్ర్టాల హక్కులను కాలరాసే విధంగా.. వాటి అధికారాలను కొల్లగొట్టేలా పలు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది. దీంతో దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే చాలామంది ముఖ్యమంత్రులు అసహ్యించుకుంటున్నారే చెప్పవచ్చు. అందుకని చాలా సార్లు వారి మాటల్లో నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పలు రాష్ట్రాల పర్యటనలకు వెళ్లినప్పుడు మోడీని వారు స్వాగతించకపోవడం కూడా దీనిలో భాగంగానే అని తెలుస్తోంది.
ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్‌తో పాటు.. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రె కూడా ప్రధాని మోడీ అంటే పెద్దగా ఇంట్రస్టు చూపడం లేదు. దేశాన్ని ముందుకు నడిపించాల్సిన అధికారంలో ఉండి కూడా రాష్ట్రాలను పట్టించుకోకుండా.. కేవలం కొంతమంది బిజినెస్ మన్లకు ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోవడం వంటివి కూడా వారి ఆగ్రహానికి కారణమవుతోంది..
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాలతో ఏడాది కాలంపాటు రైతులంతా ఏకమై ఢిల్లీ పొలిమేరల్లో ఆందోళన చేశారు. ఈ ఆందోళనల్లో దాదాపు 700 మందికి పైగా రైతులు చనిపోయారు. వందలాది కుటుంబాలు పెద్ద దిక్కు లేకుండా పోయాయి. అంతేకాకుండా కేంద్రంలోని ఓ మంత్రి కుమారుడు కావాలని రైతులపై కారుతో తొక్కించి చంపేసిన ఘటన కూడా ఉంది..
అయితే.. అయిదు రాష్ర్టాల ఎన్నికల దృష్ట్యా ప్రధాని మోడీ కొత్త పన్నాగం పన్నారు. తాము తీసుకొచ్చిన రైతు చట్టాలను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నామని, యావత్ దేశ ప్రజలకు ఈ సందర్భంగా తాను క్షమాపణ చెబుతున్నట్టు తెలిపారు. ఇది కేవలం ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడానికి చేసిన ఎత్తుగడగానే పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు..
దేశానికి దిక్సూచిగా కేసీఆర్.. బీజేపీ అసమర్థ పాలనను ఎత్తిచూపినందుకేనా?
దేశంలో గుణాత్మక మార్పు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మార్పు కోసం ఏం చేయాలో అంతా చేస్తానని.. ఈ అంశంపై అందరినీ కలుపుకొని వెళ్తానన్నారు. దీనిపై కొద్ది రోజుల్లోనే అన్ని విషయాలు ప్రకటిస్తానని తెలిపారు. దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని తాను ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ‘నయా సోంచ్.. నయా దిశా.. నయా సంవిధాన్’ అవసరముందని తెలిపారు కేసీఆర్.
‘‘రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితా అంటూ ఎవరేం చేయాలో స్పష్టంగా ఉంది. కానీ, కేంద్రం రాష్ట్రాల అధికారాలు లాగేసుకుంటోంది’’ అని కేసీఆర్ ఆరోపించారు. వన్ నేషన్.. వన్ రిజిస్ట్రేషన్ అంటే దాని అర్థం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.. ఇది రాష్ట్రాల అధికారాలు హరించడం కాదా.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇష్టం వచ్చినట్టు తీసుకుంటాం అంటే ఎలా అని ప్రశ్నించారు. ఇవన్నీ ఇట్లున్నాయి కాబట్టే నేను రాజ్యాంగం మార్చాలని కోరుతున్నా అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఉద్యమం వర్సెస్ అహంకారం..
తెలంగాణపై రాజ్యసభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ భగ్గుమంటోంది. ప్రజా ఉద్యమమాన్ని కించపరుస్తూ దేశ ప్రధాని ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రతి పౌరుడు ఆవేదన చెందుతున్నాడు. కేంద్రం దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ బతకడం లేదని.. దానికి ఎన్నో ఉదాహరణలు చూపుతున్నారు ఇంటలెక్చువల్స్. అంతేకాకుండా కేంద్రంలోని బీజేపీ తరు.. తెలంగాణపై మోడీ అహంకారం.. వంటి వాటిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై ప్రివిలేజ్ కమిటీ ఎదుట తేల్చుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ కూడా రెడీ అయ్యింది. మోడీపై రాజ్యసభలో నోటీస్ ఇవ్వడానికి ఉన్న న్యాయపరమైన అంశాలను ఆ పార్టీ నేతలు పరిశీలిస్తున్నారు. రాజ్యసభ ఎంపీ కేశవరావు అధ్యర్యంలోని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ టీం ప్రివిలేజ్ మోషన్ ను మూవ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఆ మేరకు న్యాయపరమైన చిక్కులను అధిగమించడానికి నిపుణులతో ఢిల్లీలో కేశవరావు సమావేశం అయ్యారు. పార్లమెంట్లో మోడీపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం ద్వారా ప్రత్యేక రాష్ట్రం ఎలా ఏర్పడింది? విభజన చట్టంలోని అంశాలను ఎందుకు అమలు చేయడంలేదు? అనే అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని ప్లాన్ చేస్తున్నారు.
కాంగ్రెస్ అహంకారం, రాజకీయ దాహం కారణంగానే ఉమ్మడి ఏపీ విడిపోయిందని తాజాగా ప్రధాని మోడీ పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు. దీంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని కించపరిచాడని టీఆర్ఎస్ లాజిక్ లాగింది. ఉద్యమం కంటే కాంగ్రెస్ అహంకారం కారణంగా ఉమ్మడి ఏపీ విడిపోయిందని మోడీ తేల్చేశాడు. పరోక్షంగా తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసిన మోడీపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు ప్రయత్నం చేస్తున్నారు. అదే జరిగితే, మరోసారి పార్లమెంట్ వేదికగా తెలంగాణ సెంటిమెంట్ , ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, సమైఖ్యవాదం మళ్లీ తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మోడీ చుట్టూ పద్మవ్యూహం అల్లొచ్చని కేసీఆర్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. సో.. ప్రివిలేజ్ మోషన్ మూవ్ అయితే విభజన అంశాలు, ఉద్యమంలోని లోగుట్టు తదితర అంశాలపై రసవత్తర చర్చ జరిగే అవకాశం ఉంటుందని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు.
మోడీ వ్యాఖ్యలతో భగ్గుమన్న తెలంగాణ..
పార్లమెంట్ లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ భగ్గుమంది. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా మోడీ దిష్టిబొమ్మ లను తగుల పెట్టారు. మోడీ కామెంట్స్ తర్వాత తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మోడీకి వ్యతిరేకంగా నినాదాలు. మోడీ, బీజేపీ డౌన్‌డౌన్ అంటూ తెలంగాణ దద్దరిల్లుతోంది. రాష్ట్ర విభజన తర్వాత తలెత్తిన సమస్యలను ప్రధాని ఏనాడూ పట్టించుకోలేదని, అభివృద్ధిలో ముందుకు సాగుతున్న తెలంగాణపై మొదటి నుంచి చిన్నచూపే ఉందని అంటున్నారు పలువురు లీడర్లు.
మోడీకి కేసీఆర్ మరో ఝలక్..
బీజేపీపై వరుసగా ప్రతీ అంశంలోనూ విరుచుకుపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. మరో అంశంలోనూ బీజేపీని అపోజ్ చేయాలని డిసైడయ్యారు. వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ మోడీకి లేఖ రాయాలని చూస్తున్నారు కేసీఆర్. రాష్ట్రాలకు ఉండే అధికారాలు ఈ ప్లాన్ వల్ల కోల్పోతాయన్నది కేసీఆర్ అభిప్రాయం. ముఖ్యంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ నుంచి రాష్ట్రానికి వచ్చే ఆదాయం రాష్ట్ర ఆదాయానికి ఆయువుపట్టులాంటిదని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ చార్జీలను నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో జులై 2021న స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచింది ప్రభుత్వం. ఆ తర్వాత జులై 2021, ఫిబ్రవరి 1న రెండు సార్లు భూముల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఈ నిర్ణయాధికారం కేంద్రానికి ఇస్తే రాష్ట్రాలు తమకు వచ్చే ఆదాయం కోల్పోతాయన్నది కేసీఆర్ భయం.
జులై 2017లో జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత నుండి ఆల్కహాల్‌తో పాటు మరికొన్నిటిపై సేల్స్ టాక్స్, వ్యాట్ వేసే అధికారాన్ని రాష్ట్రాలు కోల్పోయాయి. కట్టించుకున్న జీఎస్టీ నుంచి కేంద్రం నుంచి రావాల్సిన వాటా ఆదాయం కోసం చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఎదురుచూస్తున్నాయి. ఏటా తెలంగాణ స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ద్వారా 12వేల కోట్ల ఆదాయం పొందుతోంది. చార్జీల పెంపు తర్వాత అది 15వేల కోట్లకు చేరుతుందని అంచనా. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా బీజేపీ అన్నా.. మోడీ అన్నా అగ్గిఫైర్ అవుతున్నారు. ఈ నేపధ్యంలోనే వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్రతిపాదనపై కూడా గట్టిగా తమ గళాన్ని వినిపించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.