ప్రస్తుతం భారత్‌లో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. అయితే ఈ పరిణామాలకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పిదాలే కారణమని స్పష్టమవుతోంది. ఏడాదిగా మన దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నా కోవిడ్ రోగులకు ముఖ్యమైన ఆక్సిజన్‌ను స్టాక్ ఉంచుకోకుండా పక్క దేశాలకు రికార్డు స్థాయిలో భారత్ ఎగుమతులు చేసింది. 2020 జనవరి నుంచి 2021 జనవరి వరకు మోదీ సర్కారు 700 శాతం అధికంగా ఆక్సిజన్‌ను ఎగుమతి చేసినట్లు తెలుస్తోంది. 2018-19లో మోదీ సర్కారు 5,744 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఎగుమతి చేయగా.. 2019-20లో 4,502 మెట్రిక్ టన్నులను ఎగుమతి చేసింది. కానీ 2020-21 కాలంలో ఏకంగా 9,294 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను బీజేపీ ప్రభుత్వం విదేశాలకు ఎగుమతి చేసింది.
అయితే ప్రభుత్వ ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు భారత్ కేవలం ఇండస్ట్రియల్ ఆక్సిజన్‌ను మాత్రమే విదేశాలకు సరఫరా చేసిందని బుకాయింపు మాటలు చెప్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి పెద్ద పెద్ద పరిశ్రమలే మెడికల్ ఆక్సిజన్‌ను తయారుచేసి పక్క రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వ వర్గాల బుకాయింపు మాటలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటు కేంద్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా ఆక్సిజన్, కోవిడ్ మందులపై 12 శాతం జీఎస్టీ విధిస్తూ శవాలపై పేళాలను ఏరుకుంటోంది. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ సర్కారు రెమ్డిసెవెర్, ఆక్సిజన్ సిలిండర్లపై 12 శాతం జీఎస్టీ వేస్తుండగా.. వెంటిలేటర్ల మీద 20 శాతం జీఎస్టీ దండుకుంటోంది. ఒకపక్క కరోనా పరిస్థితుల కారణంగా పేదవాళ్లు డబ్బులు లేక అల్లాడుతుంటే.. కనికరం చూపించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇలా ట్యాక్సుల పేరుతో పేదల ప్రాణాలను హరించడం సబబు కాదని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.