Friday, November 22, 2024

War: ఎవరి డిమాండ్‌ వారిదే.. ఉక్రెయిన్‌-రష్యా చర్చలు అసంపూర్ణం!

రష్యా-ఉక్రెయిన్‌ దేశాల మధ్య సుమారు 4 గంటల పాటు కొనసాగిన చర్చలు విఫలం అయినట్టు సమాచారం. బెలారస్‌ సరిహద్దులో గోమెయిల్‌ వేదికగా సోమవారం మధ్యాహ్నం చర్చలు ప్రారంభం అయ్యాయి. ఉక్రెయిన్‌ రెండు డిమాండ్‌లతో ముందుకెళ్లగా.. రష్యా మాత్రం నాటో డిమాండ్‌ను జెలెన్‌ స్కీ బృందం ఎందుట ఉంచింది. తమ దేశం నుంచి రష్యా దళాల ఉప సంహరణతో పాటు కాల్పుల విరమణను అమలు చేయాలని ఉక్రెయిన్‌ బృందం పట్టుబట్టింది. క్రిమియా నుంచి కూడా బలగాలను తొలగించాలని ఉక్రెయిన్‌ డిమాండ్‌ చేస్తున్నది. నాటో విషయంలో లిఖితపూర్వక హామీ ఇవ్వాలంటూ అటు రష్యా పట్టుబట్టింది. తమ డిమాండ్‌కు సానుకూలంగా స్పందిస్తే.. రెండు డిమాండ్లను అమలు చేస్తామంటూ రష్యా తేల్చి చెప్పింది. దీనికి ఉక్రెయిన్‌ ససేమిరా అన్నట్టు సమాచారం. దీంతో రష్యా కూడా ఉక్రెయిన్‌ నుంచి బలగాలను వెనక్కి రప్పించుకునేందుకు విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ఎలాంటి తీర్మానం లేకుండానే శాంతి చర్చలు ముగిసినట్టు సమాచారం.

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన వందలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలోనే.. సోమవారం ఇరు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. యుద్ధానికి తెరదించే దిశగా ఇరు దేశాల మధ్య కీలక చర్చలు ప్రారంభం అయ్యాయి. భారత్‌ కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయమే.. రష్యా, ఉక్రెయిన్‌ బృందాలు శాంతి చర్చల కోసం బెలారస్‌ సరిహద్దు నగరమైన గోమెయిల్‌కు చేరుకున్నాయి. మధ్యాహ్నం 2:30 గంటల తరువాత ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభం అయ్యాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడి సలహాదారు మైఖైలో పోడోల్యాక్‌ ధ్రువీకరించినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రకటించాయి. రష్యా అధ్యక్ష కార్యాలయం సహా రక్షణ, విదేశాంగ శాఖకు చెందిన ఐదుగురు అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. ఉక్రెయిన్‌ నుంచి పలు విభాగాలకు చెందిన ఆరుగురు అధికారులు పాల్గొన్నారు. ఈ చర్చలకు ముందే.. రష్యా, ఉక్రెయిన్‌లు తమ డిమాండ్లను స్పష్టం చేశాయి. తమ డిమాండ్ల పరిష్కారంపై ఒప్పందం ఉండాలని రష్యా స్పష్టం చేయగా.. తక్షణమే కాల్పుల విరమణను అమలు చేయాలని ఉక్రెయిన్‌ తేల్చి చెప్పింది. నాటోలో చేరబోమని ఉక్రెయిన్‌ లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలనేది రష్యా డిమాండ్‌. వెంటనే కాల్పులు నిలిపివేయాలనేది.. ఉక్రెయిన్‌ డిమాండ్‌. ఐదు రోజులుగా ఉక్రెయిన్‌ భూభాగం బాంబులు, తుపాకీ మోతతో దద్దరిల్లి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. ఈ చర్చల పురోగతిపై యావత్‌ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నది.

చర్చల్లో క్రిమియా, డాన్‌బాస్‌ చర్చ
క్రిమియా, డాన్‌బాస్‌తో పాటు ఉక్రెయిన్‌ నుంచి రష్యా తమ బలగాలను ఉప సంహరించుకోవాలనే ప్రతిపాదనను రష్యా ప్రతినిధుల బృందం ముందు ఉంచినట్టు రష్యా మీడియా సంస్థ స్పుత్నిక్‌ తెలిపింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అణ్వాయుధాల ఉపయోగంపై చేసిన ప్రకటనపై కూడా ఇరు దేశాల మధ్య చర్చకు దారితీసింది. అణు యుద్ధం వద్దని ప్రపంచ దేశాలు వారిస్తున్నా పుతిన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని రష్యా బృందం దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. ఉక్రెయిన్‌పై చేస్తున్న దాడులకు సంబంధించిన విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. తమ సైనిక స్థావరాలు, ఆయుధ కర్మాగారాలపైనే దాడులు చేస్తామన్న రష్యా.. నివాస భవనాలపై ఎందుకు క్షిపణి దాడులకు దిగుతుందో తెలియజేయాలని కోరినట్టు తెలుస్తున్నది. ఉక్రెయిన్‌లోని పలు నగరాల్లో నేలమట్టమైన భవనాలు, చిల్డ్రన్‌ పార్కులు, అనాథ శరణాలయాలు, పరిపాలనా భవనాలకు సంబంధించిన ఫొటోలను కూడా రష్యా ముందు ఉంచినట్టు తెలుస్తున్నది.

రష్యాకు బెలారస్‌ ఆర్మీ సాయం!
ఉక్రెయిన్‌ కేవలం రెండు కీలక డిమాండ్లను రష్యా ముందు ఉంది. మొదటి డిమాండ్‌.. రష్యా తక్షణమే కాల్పుల విరమణ చేయడం, రెండోది.. రష్యా సైన్యం వెంటనే వెనక్కి వెళ్లిపోవాలి. ఈ నేపథ్యంలోనే.. రష్యా కూడా ఒకే ఒక కీలక డిమాండ్‌ను ఉక్రెయిన్‌ ముందు ఉంచింది. నాటోలో చేరేది లేదని ఉక్రెయిన్‌ రాతపూర్వకంగా హామీ ఇస్తే.. వెంటనే ఉక్రెయిన్‌ తమ ముందు ఉంచిన రెండు డిమాండ్‌లను అమలు చేస్తామని రష్యా ప్రకటించినట్టు తెలుస్తున్నది. అమెరికా హెచ్చరికలను కూడా రష్యా ముందు ఉంచింది ఉక్రెయిన్‌. తమ దేశాన్ని హస్తగతం చేసుకునేందుకు బెలారస్‌ ఆర్మీని కూడా దించేందుకు రష్యా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, ఇందులో ఎంత నిజం ఉందో చెప్పాలని కోరింది. ఈ విషయాన్ని రష్యా ఖండించింది. అమెరికా చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదని తెలిపింది. రష్యా జరిపిన దాడుల్లో వేలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయని, లక్షలాది మంది నిరాశ్రయురాలయ్యారని, ఇప్పటికే చాలా మంది ఉక్రెయిన్‌ విడిచి వెళ్లిపోయారని వివరించింది. దీనంతటికి కారణం రష్యాయే అని చెప్పినట్టు సమాచారం. ప్రపంచం ముందు రష్యా ఒకటి చెబుతున్నది.. తమతో చేస్తోంది ఒకటని ఉక్రెయిన్‌ బృందం నిలదీసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement