Saturday, November 23, 2024

హుజురాబాద్ టికెట్ రెడ్డి వర్గానికా? బీసీలకా ?

తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరు? టీఆర్‌ఎస్‌ టికెట్‌ రెడ్డి సామాజిక వర్గానికి దక్కుతుందా? లేక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఇస్తారా?ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే ఆసక్తికర చర్చ. టీఆర్ఎస్ టికెట్ అభ్యర్థిగా పలువురు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. టీఆర్ఎస్ టికెట్ తనదే అంటూ ఇటీవల హడావిడి చేసిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. దీంతో ఆయన హుజురాబాద్ బరిలో ఎవరు ఉంటారు ? అన్నది ఉత్కంఠగా మారింది. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ఆశలు, అభిప్రాయాలకు అనుగుణంగా తగిన అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిమగ్నమైంది. ఆది నుంచి హుజూరాబాద్‌కు రెడ్డి సామాజికవర్గం ప్రాతినిధ్యం వహించింది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తదుపరి దానికి బ్రేక్‌ పడింది. ఈసారి ఎమ్మెల్యే టికెట్‌ను రెడ్డి సామాజికవర్గానికి ఇవ్వడమా? లేక మరో పదవి ద్వారా వారికి న్యాయం చేయడమా? అన్న కోణంలో అధిష్ఠానం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కేసీఆర్‌ ఆలోచనా విధానానికి ఆకర్షితుడై ఇటీవలే పార్టీలో చేరిన యువ నేత కౌశిక్‌రెడ్డికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే టికెట్‌ కూడా రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తారా? లేక బీసీ వర్గాలకు దక్కుతుందా? అన్న చర్చ మొదలైంది.

హుజురాబాద్ టికెట్‌ను రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వాలనుకుంటే బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఇనుగాల పెద్దిరెడ్డికి అవకాశం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్సీ పదవిని రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినందున, ఎమ్మెల్యే టికెట్‌ విషయంలో అధిష్ఠానం బీసీలవైపే మొగ్గుచూపవచ్చని భావిస్తున్నారు. హుజూరాబాద్‌లో యాదవులు, మున్నూరుకాపు, గౌడ, పద్మశాలి, ముదిరాజ్‌, రజక తదితర అన్ని బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి.

దీంతో పార్టీ టికెట్‌ కోసం పోటీ అధికంగా ఉంది. ఒకవేళ టికెట్‌ బీసీలకే ఏ వర్గానికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? అన్నదానిపై అధిష్ఠానం అభిప్రాయ సేకరణ చేస్తున్నది. ఇక, ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన ఎల్‌ రమణ పేరును పరిశీలిస్తున్నారు. ఒకవేళ మున్నూరు కాపుల నుంచి ఎంపిక చేయాల్సి వస్తే, పొనుగంటి మల్లయ్యకు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. ఇక అధిష్ఠానం యాదవ సామాజిక వర్గంవైపు మొగ్గుచూపితే, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నా యకుడు, టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్‌కు టికెట్‌ దక్కవచ్చని అంటున్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ నియోజకవర్గంపై సీఎం కసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. కొత్త పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అక్కడి ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ అక్కడి నుంచే ప్రారంభించారు. దళిత బంధు పథకాన్ని కూడా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచే అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద అర్హులైన దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నారు. గొర్రెల పంపిణీ ప్రక్రియను కూడా ఇక్కడే ప్రారంభించారు. వీటికి తోడు పలు సామాజిక వర్గాల వారీగా కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తున్నారు. హుజూరాబాద్ పట్టణ అభివృద్ధికి ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేవారు. ఇక ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా హుజూరాబాద్‌కే చెందిన బండ శ్రీనివాస్‌ను నియమించారు. ఓటర్లు ఈటల వైపుకు మళ్లకుండా తమ వైపు ఆకర్షించేందుకు రకరకాల స్కీమ్‌ను అమలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Telangana cabinet: పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

Advertisement

తాజా వార్తలు

Advertisement