Friday, November 22, 2024

National | ఇంతకీ వాళ్ల ప్రధాని అభ్యర్థి ఎవరు?.. విపక్షాల భేటీపై బీజేపీ నేత సెటైర్లు!

‘‘ఇంతకీ వాళ్ల ప్రధాని అభ్యర్థి ఎవరో ముందు తేల్చుకోమనండి. అంతకుముందు కూడా మహా కూటమి కట్టారు. ఇప్పుడూ అదే చేయబోతున్నారు. వారిలో వారికే ఐక్యత లేదు. ప్రధాని అభ్యర్థి కోసం వాళ్ల మధ్య ఘర్షణ వాతావరణం ఉంది. ప్రధాని మోదీని ఒంటరిగా ఎదుర్కోలేక ఈ కూటమి కడుతున్నారు” అంటూ బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ విపక్షాల భేటీపై సెటైర్లు వేశారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ప్రధాని మోదీని ఎదుర్కొనే దమ్ములేక విపక్ష పార్టీలన్నీ కూటమి కడుతున్నాయని బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ అన్నారు. జూన్ 23 న జరగనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశంపై ఆయన విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి పదవి కోసం విపక్ష పార్టీలు, నేతల మధ్య పోరు జరుగుతోందన్నారు. ముఖ్యంగా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రతిపక్ష అగ్రనేతల సమావేశానికి పిలవడంపై రవిశంకర్​ విమర్శలు గుప్పించారు. కాగా, జూన్ 23న పాట్నాలో విపక్ష నేతల భేటీ జరుగుతుందని జెడి(యు) జాతీయ అధ్యక్షుడు లాలన్ సింగ్ తెలిపారు.

- Advertisement -

పాట్నాలో మీడియాతో మాట్లాడిన రవిశంకర్ “ విపక్షాల (ప్రతిపక్ష) ప్రధాని ఎవరు?… వారి మధ్య చాలా వ్యతిరేకత ఉంది” అన్నారు. మహాకూటమిలోని పార్టీలను ‘అధికారం కోసం స్వార్థపరుల’ సభగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీని ఒంటరిగా ఎదుర్కోలేని అసమర్థత గలవారని దుయ్యబట్టారు. ఇది అధికారం కోసం స్వార్థపరులు కడుతున్న కూటమి అని, వారు ప్రధాని మోదీని ఒంటరిగా ఎదుర్కోలేరు కాబట్టి, వారంతా కలిసికట్టుగా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. భారతదేశం స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటుందని, ఒకరితో ఒకరు పోరాడుకునే వ్యక్తుల సమూహం కాదన్నారు. 

అయితే.. ఈ మధ్యనే బిహార్​ సీఎం నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. విపక్షాల ఐక్యత కారణంగా లోక్‌సభ ఎన్నికలను షెడ్యూల్ కంటే ముందుగానే నిర్వహించడానికి బీజేపీ ప్లాన్​ చేస్తోందన్నారు.  ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్షాలు ఏకం కావడం గమనించి, ఈ ఐక్యత వారికి పెద్ద నష్టాన్ని తీసుకొస్తుందని భావిస్తున్నారని నితీష్ కుమార్ చెప్పారు. అందుకనే ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి బీజేపీ యత్నించొచ్చన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీ ఉందని, లోక్‌సభ ఎన్నికలను ముందస్తుగా ప్లాన్​ చేయవచ్చని.. రాబోయే కాలంలో ప్రతిపక్షాల ఐక్యత తమపై ప్రభావం చూపుతుందని వారు (బిజెపి) భావించవచ్చన్నారు బీహార్​ సీఎం నితీశ్​. కాబట్టి లోక్‌సభ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించాలని అనుకుంటున్నారని విలేకరులతో అన్నారు. విపక్షాలన్నీ ఐక్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి బీజేపీని గద్దె దింపడం ఖాయమని ఆయన ఉద్ఘాటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని తాను అన్ని పార్టీలను కోరానని. అందుకనే జూన్ 23 సమావేశం తర్వాత తాము దీనిపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement