దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ కు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే, అధికార బీజేపీ మాత్రం తమ విజయం ఖాయమని చెబుతోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి భారీ విజయం నమోదు చేస్తామని, తమ అధికారం కొనసాగుతుందని అంటోంది. అదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థలను సైతం ఖరారు చేసే పనిలో ప్రధాన పార్టీలు ఉన్నాయి. అయితే, ఈసారి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అన్నది ఉత్కంఠ రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ పోటీ చేయడం ఇదే తొలిసారి. యోగి మధుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన ఐదు సార్లు గోరఖ్ పూర్ నుంచి ఎంపీగా గెలిచారు. అయితే, 2017 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఆయనను ముఖ్యమంత్రిగా ప్రకటించారు. తాజాగా జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైయ్యారు.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. పార్టీ చెప్పిన చోట తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాని స్పష్టం చేశారు. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ యూపీ శాసనమండలి సభ్యునిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో అయోధ్య లేదా మధురా నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆయన సొంత నియోజకవర్గం గోరఖ్‌పుర్ నుంచి కూడా బరిలోకి దిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అయితే, భారతీయ జనతా పార్టీ మాత్రం మధుర స్థానం నుండి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను పోటీకి దించే అవకాశం లేదని తెలుస్తోంది. కీలకమైన ఈ నియోజకవర్గం నుంచి శ్రీకాంత్ శర్మకు బీజేపీ టిక్కెట్టు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. మధుర సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన శర్మ.. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో మంత్రిగా కూడా ఉన్నారు. ఆదిత్యనాథ్‌ను మధుర నుంచి పోటీకి దింపుతున్నారనే ప్రచారం గత కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతోంది. ఇటీవల, బిజెపి రాజ్యసభ సభ్యుడు హరనాథ్ సింగ్ యాదవ్ మథుర నుండి యుపి సిఎంకు టిక్కెట్ ఇవ్వాలని కోరారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ కోర్ కమిటీ రెండో రోజు ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఈరోజు సమావేశం కానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. బీజేపీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్, పార్టీ యూపీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, రాష్ట్ర పార్టీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించడాన్ని అమిత్ షా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. అయితే, కొంతమంది ఎమ్మెల్యేల సీట్లు మారే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..