కోవిడ్ సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు థర్డ్ వేవ్ భయాందోళనలు కలిగిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో మూడోదశ ప్రారంభమైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఏ దేశంలోనూ మహమ్మారి ముగింపునకు రాలేదని.. కొత్త, ప్రమాదకరమైన వేరియంట్లు వైరస్ ఉద్ధృతికి దోహదం చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రానున్న 100 రోజులు అత్యంత కీలకమని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. చాలా దేశాల్లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని వెల్లడించింది. ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని కేంద్రం ఆదేశించింది. ఇప్పటికే ప్రధాని మూడో దశ పై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు మూడో దశ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. వ్యాక్సినేషన్ పక్రియ ముమ్మరంగా సాగాలని ఆదేశించారు. అమెరికా మినహా స్పెయిన్, థాయిలాండ్, ఆఫ్రికా దేశాల్లో థర్డ్ వేవ్ స్పష్టంగా కనిపిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.