Friday, November 22, 2024

భూమిలో గుప్తనిధులు దొరికితే ఎలా పంచుతారు?

జనగామ జిల్లా పెంబర్తిలో ఇటీవల రైతుకు ఓ లంకెబిందె దొరికింది. అందులో 18 తులాల 7 గ్రాముల బంగారం, కిలో 720 గ్రాముల వెండి, పగడాలు, రాగిపాత్ర లభ్యమయ్యాయి. భూ యజమానులు అధికారులకు సమాచారం ఇవ్వగానే వారొచ్చి గుప్తనిధిని తీసుకెళ్లారు. అయితే అధికారులు ఆ నిధిని ఏం చేస్తారు? భూ యజమానులకు ఇస్తారా? ప్రభుత్వ ఖజానాకే చెందుతుందా? ఆ నిధిపై భూయజమానులకు ఎలాంటి హక్కులు ఉండవా ? అనే అనుమానాలు అందరికీ వచ్చాయి. మరి ఇలాంటి గుప్త నిధుల గురించి చట్టం ఏం చెబుతుందనే విషయాలను ఓ సారి పరిశీలిద్దాం.

భూమిలోపల దొరికిన ఎలాంటి నిధిపైనా ఎవరికీ హక్కులుండవు. అది వార సత్వ సంపద కింద ప్రభుతానికే చెందుతుంది. ఇందుకు సంబంధించి ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా చట్టంలో పలు నిబంధనలున్నాయి. భూమిలో పాతిపెట్టిన నిధి జాతి వారసత్వ సంపద అయితే.. ఆ సొమ్ముపై ఎవరికీ ఎలాంటి హక్కులు ఉండవు. దాన్ని పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.

ఒకవేళ సంపద పూర్వీకులది అయితే..?
భూమిలో గుప్త నిధి దొరికిందని సమాచారం రాగానే మొదట స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులు ఆ నిధిని పంచనామా చేసి కలెక్టర్‌కు స్వాధీనపరుస్తారు. కలెక్టర్‌ అది వారసత్వ సంపదా? లేక పూర్వీకులు దాచి ఉంచినదా? అన్నది నిర్ధారిస్తారు. పూర్వీకులదైతే.. దాని వారసులెవరన్నదానిపై విచారించి సంపదను వాటాలుగా విభజించి పంచుతారు. లభించిన సొమ్ములో 1/5 వంతు భూ యజమానికి అప్పగిస్తారు. ఆ భూమిని యజమాని కాకుండా వేరొకరు సాగుచేస్తుంటే సదరు కౌలుదారులు, నిధిని వెలికితీసిన కూలీలకు 1/5 వంతులోనే కొంత వాటా దక్కుతుంది. గుప్తనిధి లభించిన సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా కాజేయాలని చూస్తే సదరు వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలుశిక్ష, జరిమానా రెండూ విధించే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement